అనకాపల్లి జిల్లాలో టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడిపై మరో కేసు నమోదైంది. పోలీసులను దుర్భాషలాడటం, దురుసుగా ప్రవర్తించడంపై అధికారులు విచారించి సెక్షన్ 353తో పాటు మరికొన్ని సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళ్తే… రెండు రోజుల క్రితం నర్సీపట్నం గ్రామదేవత ఉత్సవాల్లో కొందరు యువకుల దూకుడు కారణంగా తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. జాతర సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఎట్టిపరిస్థితుల్లోనూ రాత్రి 11 గంటల తర్వాత జరపడానికి వీల్లేదంటూ పోలీసులు ఆదేశాలు జారీ చేశారు.
అయితే గతంలో ఎన్నడూ లేని విధంగా పోలీసులు ఆంక్షలు విధించడంపై యువకులు ఘర్షణకు దిగారు. దీంతో పోలీసులు యువకులపై లాఠీలు ఝుళిపించారు. ఇంత జరిగినా యువకులు వెనక్కి తగ్గకుండా జాతరలో సెల్ ఫోన్ లైట్ల వెలుగులోనే నృత్యాలు చేశారు. బాణసంచా కాల్చారు. జాతర సందర్భంగా విధించిన ఆంక్షలపై టీడీపీ కార్యకర్తలు నిరసనకు దిగారు. ఈ నేపథ్యంలో టీడీపీ కార్యకర్తలు, పోలీసుల మధ్య తోపులాట జరిగింది. ఈ గొడవ జరుగుతున్న సమయంలో మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు పోలీసులను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు నిర్ధారణ అయ్యింది.