ఏలూరు జిల్లాలోని ద్వారకా తిరుమల మండలం జి.కొత్తపల్లిలో జరిగిన వైసీపీ నేత గంజి ప్రసాద్ హత్య కేసులో కీలక అంశాలను వెల్లడించారు పోలీసులు.. రెండు వర్గాల మధ్య నెలకొన్న ఘర్షణలో భాగంగా వైసీపీ నేత గంజి ప్రసాద్ హత్యకు గురయ్యారు. బజరయ్య సహకారంతో సురేశ్, హేమంత్, మోహన్‌లు కలిసి గంజి ప్రసాద్‌ను పథకం ప్రకారం హత్య చేసినట్టు పోలీసు విచారణలో తేలింది.
Read Also: RBI: వడ్డీ రేట్లను పెంచిన ఆర్బీఐ.. కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు..!
రెడ్డి సత్యనారాయణ ఇంట్లో జరిగిన ఓ వేడుకలో గంజి ప్రసాద్ హత్యకు ప్లాన్ చేసినట్టు తెలిసింది. ఈ కేసులో ఆరుగురు నిందితుల్ని అరెస్ట్ చేసిన పోలీసులు.. రెండు బైక్‌లు, కత్తులు స్వాధీనం చేసుకున్నారు. చాలాకాలం నుంచి రెండు వర్గాల మధ్య విభేదాలు ఉన్నాయి. అయితే, అవి చినికి చినికి గాలివానగా మారి, గంజి ప్రసాద్‌ను బలి తీసుకున్నాయి. ఈ గొడవల్ని సరి చేయడంలో విఫలమవ్వడంతో, ద్వారక తిరుమల ఎస్సైను సస్పెండ్ చేశారు.
కాగా.. తన భర్తను ఎమ్మెల్యే తలారి వెంకట్రావే చంపించాడని గంజి ప్రసాద్ భార్య సత్యవతి ఆరోపణలు చేశారు. తనకు అనుకూలంగా ఉన్న వర్గాన్ని ప్రోత్సహించి, హత్య చేయించారని ఆమె వాపోయారు. ఎమ్మెల్యేని సస్పెండ్ చేయడంతో పాటు గంజి ప్రసాద్‌ను చంపిన వారిని కఠినంగా శిక్షించాలని సత్యవతి డిమాండ్ చేశారు. అలాగే కుటుంబ పెద్దను కోల్పోయామని, రూ. 5 కోట్ల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని విజ్ఞప్తి చేశారు.