పేద ప్రజలను వైసీపీ ప్రభుత్వం నిలువునా దోపిడీ చేస్తోందని మాజీ మంత్రి పీతల సుజాత పేర్కొన్నారు. నేడు పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో ఆమె మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ఇసుక, భూకబ్జాలు, లిక్కర్, గనులదోపిడీతో వైసీపీ నేతలు జేబులు నింపుకుంటున్నారని మండిపడ్డారు. ఇప్పుడు పేద ప్రజలను కూడా దోచుకోవడానికి సిద్ధమయ్యారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
మొదటి నుంచి గత ప్రభుత్వాలు చేసిన పనులను తాము చేసినట్టు రంగులు వేసుకుని ప్రభుత్వం గొప్పలు చెప్పిందని పీతల సుజాత అన్నారు. 1983 నుంచి ప్రభుత్వాలు పేదలకు కట్టించిన పక్కా ఇళ్ల మీద పట్టాల పేరుతో వన్ టైం సెటిల్మెంట్ అంటూ వేల కోట్లు గుంజడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తుందన్నారు.ప్రజలు ఎవరూ కూడా ప్రభుత్వానికి డబ్బులు కట్టనవసరం లేదని స్పష్టం చేశారు. ప్రజలందరూ కూడా ప్రజావ్యతిరేక ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడాలని పీతల సుజాత పిలుపునిచ్చారు. వైసీపీ ప్రభుత్వం రాజ్యాంగానికి తూట్లు పొడుస్తూ పాలన సాగిస్తుందని పీతల సుజాత ధ్వజమెత్తారు.