పదో తరగతి ప్రశ్నాపత్రాల లీకేజ్ వివాదంలో మాజీ మంత్రి నారాయణ అరెస్ట్ వ్యవహారం ఏపీలో తీవ్ర కలకలం రేపుతోంది. అధికార, ప్రతిపక్ష పార్టీ నేతల మధ్య మాటల యుద్ధానికి దారి తీసింది. ఇది ముమ్మాటికీ కక్ష సాధింపు చర్యేనని, ప్రభుత్వ అసమర్థతను కప్పిపుచ్చుకోవడం కోసం నారాయణపై అక్రమ కేసులు బనాయించి అరెస్ట్ చేశారంటూ విమర్శిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి స్పందించారు. ఇందులో ఎలాంటి కక్ష సాధింపు లేదని, వాస్తవాల ఆధారంగానే పోలీసులు అరెస్ట్ చేశారని, విచారణలో అంతా తేలిందని స్పష్టం చేశారు.
మొత్తం నారాయణ సంస్థల్లోనే ఈ ప్రశ్నాపత్రాల మాల్ ప్రాక్టీస్ జరిగిందని పెద్దిరెడ్డి అన్నారు. ఇప్పటికే ఈ కేసులో 60 మందిని అరెస్ట్ చేశారని గుర్తు చేసిన ఆయన.. పూర్తి విచారణ జరిగిన తర్వాతే నారాయణను అరెస్ట్ చేయడం జరిగిందన్నారు. ఇదే సమయంలో పొత్తులపై చంద్రబాబు చేస్తోన్న వ్యాఖ్యలపై కూడా స్పందిస్తూ.. ఆయనకు మతిమరుపు వచ్చి రోజుకో మాట మాట్లాడుతున్నారని ఆరోపించారు. పొత్తులపై మాట్లాడింది ఆయనే, ఆ తర్వాత మాట మార్చిందీ ఆయనేనన్నారు. తనని జనం గెలిపించరన్న విషయం చంద్రబాబుకి తెలుసని, అందుకే పొత్తుల కోసం రోజు మాట్లాడుతున్నారన్నారు. వైఎస్సార్‌సీపీ మాత్రం ఒంటరిగా పోటీ చేసి, మళ్ళీ గెలిచి తీరుతుందపి పెద్దిరెడ్డి ధీమా వ్యక్తం చేశారు.