విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మంగళగిరి జనసేన కార్యాలయంలో పవన్ కళ్యాణ్ చేపట్టిన ఒక్కరోజు నిరాహారదీక్ష ముగిసింది. అనంతరం పవన్ కళ్యాణ్ ప్రసంగిస్తూ వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ కేవలం పరిశ్రమ మాత్రమే కాదని.. ఆంధ్రుల ఆత్మగౌరవమని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. తాను వెళ్లి కేంద్రంతో గొడవ పెట్టుకోవాలని వైసీపీ నేతలు భావిస్తున్నారని పవన్ కళ్యాణ్ ఎద్దేవా చేశారు.
Read Also: అమరావతి రైతుల పాదయాత్ర ముగింపు సభకు పవన్ కళ్యాణ్
బీజేపీతో పొత్తు పెట్టుకున్నప్పుడు అమరావతే రాజధానిగా ఉండాలని కండీషన్ పెట్టినట్లు పవన్ కళ్యాణ్ గుర్తుచేశారు . స్టీల్ ప్లాంట్ గురించి వైసీపీ నేతలను అడిగితే బూతులు తిడుతున్నారని.. దాదాపు 152 మంది ప్రాణ త్యాగాలతో సాధించిన విశాఖ స్టీల్ ప్లాంట్‌ను కాపాడుకోవాల్సిన బాధ్యత రాష్ట్రప్రభుత్వంపై ఉందని పవన్ స్పష్టం చేశారు. ప్రైవేటీకరణ అంటే వారి పోరాటానికి విలువ లేకుండా చేయడమేనన్నారు. అమరావతి సహా పలు విషయాలపై జగన్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒకమాట, అధికారంలోకి వచ్చాక మరోమాట మాట్లాడారని పవన్ కళ్యాణ్ ఆరోపించారు. విలువలు లేని వైసీపీకి రాజ్యాంగం విలువ తెలియదని.. 22 మంది ఎంపీలు, 151 మంది ఎమ్మెల్యేలు ఉండి స్టీల్ ప్లాంట్ కోసం వైసీపీ ఏం చేస్తోందని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం అన్ని పార్టీలు ఏకం కావాలని పవన్ పిలుపునిచ్చారు. చేతగాని వైసీపీ నేతలు చట్టసభల్లో కూర్చోవడం దేనికని పవన్ నిలదీశారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై రాష్ట్ర ప్రభుత్వమే పట్టించుకోకపోతే కేంద్రం ఎలా స్పందిస్తుందని పవన్ సూటిగా ప్రశ్నించారు.