Pawan Kalyan: గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గం ఇప్పటంలో ప్రభుత్వం ఇళ్లను కూల్చివేసిన బాధితులను పరామర్శించేందుకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ఈ పర్యటనకు అనుమతి లేదని పోలీసులు స్పష్టం చేశారు. దీంతో పోలీసుల తీరుపై పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. జనసేన సభకు స్థలం ఇచ్చినందుకే ఇప్పటంలో జనసేన అభిమానుల ఇళ్లను ప్రభుత్వం కూలగొట్టిందని ఆరోపించారు. వైసీపీ గూండాల అరాచకాలు ఇలాగే కొనసాగిస్తే ఇడుపులపాయలో వైసీపీ నేతల ఇళ్ల మీద నుంచి హైవే వేస్తామని హెచ్చరించారు. పెదకాకానిలో ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి ఇంటిముందు 15 అడుగుల రోడ్డే ఉందని, అక్కడెందుకు విస్తరణ చేయరని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. రోడ్లు వేయలేని, గుంతలు పూడ్చలేని ప్రభుత్వం రోడ్లు విస్తరిస్తామని చెప్పడానికి సిగ్గుండాలని పవన్ ఫైరయ్యారు.
Read Also: Twitter: ట్విట్టర్ యూజర్లకు ఎలాన్ మస్క్ మరో షాక్.. ఈ 3 ఫీచర్ల కోసం ఛార్జీలు చెల్లించాలి..!
మరోవైపు పోలీసుల తీరుపైనా పవన్ కళ్యాణ్ తీవ్ర విమర్శలు చేశారు. పోలీసులు రేపిస్టులను రక్షిస్తున్నారని.. ప్రభుత్వానికి కొమ్ము కాస్తున్నారని మండిపడ్డారు. ఈ ప్రభుత్వానికి బుద్ధి ఉందా అని ప్రశ్నించారు. తాము గూండాలమా అని నిలదీశారు. తాము మాట్లాడకుండా ఆపడానికి మీరెవరు అని సూటి ప్రశ్న వేశారు. అంతకుముందు పవన్ కళ్యాణ్ ఇప్పటం వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పవన్ కొంత దూరం నడుచుకుంటూ వెళ్లి అక్కడి నుంచి వేరే కారులో వెళ్లిపోయారు. అయితే కారుపై కూర్చొని ప్రయాణించగా.. ఈ వీడియోను జనసైనికులు ట్యాగ్ చేస్తూ ‘మనల్ని ఎవడ్రా ఆపేది’ అని ట్వీట్లు చేశారు.