పదో తరగతి ప్రశ్నాపత్రాల లీకేజ్ వ్యవహారంలో మాజీ మంత్రి నారాయణను అరెస్ట్ చేయడాన్ని మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు తప్పు పట్టారు. ఆయన్ను అరెస్ట్ చేయడం దుర్మార్గమని చెప్పిన ఆయన, ప్రజల దృష్టిని మళ్లించడం కోసమే జగన్ ఈ అక్రమ అరెస్టులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. అధికారులందరూ వైసీపీ కార్యకర్తల్లా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. వైసీపీ పాలన వచ్చాక రాష్ట్రవ్యాప్తంగా అభివృద్ధి కుంటుపడిందని, వాటి నుంచి ప్రజల దృష్టిని మరల్చడానికే నారాయణ అరెస్ట్‌కు తెరలేపారని చెప్పారు. అసలు ఏ కేసులో నారాయణను అరెస్ట్ చేశారో అర్థం కావడం లేదని పల్లా శ్రీనివాసరావు సందేహం వ్యక్తం చేశారు.
ఈ పేపర్ లీకేజీలో కొంతమందిని అరెస్ట్ చేశామని విద్యాశాఖమంత్రి చెప్పారని, మరి నారాయణను ఎందుకు ఇందులోకి లాగారని ప్రశ్నించారు. సీఎం జగన్ ఇప్పటికే అన్ని వ్యవస్థల్ని భ్రష్టు పట్టిస్తున్నారని ఆరోపించారు. అటు.. రాష్ట్ర ఎస్సీ సెల్ నాయకుడు పుచ్చా విజయకుమార్ కూడా నారాయణ అరెస్ట్‌ని తప్పుపట్టారు. బాదుడే బాదుడే కార్యక్రమానికి చంద్రబాబుకి వస్తున్న ఆదరణను చూసి తట్టుకోలేకే, ఈ అక్రమ అరెస్ట్‌లు చేస్తున్నారన్నారు. అసలు పేపర్ లీకేజీ లేదని చెప్పిన మంత్రి, ఇప్పటికిప్పుడే నారాయణను ఏ విధంగా అరెస్ట్ చేస్తారని నిలదీశారు. పేపర్ లీకేజీకి మంత్రికి బాధ్యతలేదా? అని అడిగిన పుచ్చా విజయకుమార్.. ముందస్తు నోటీస్ లేకుండానే ఎలా అరెస్ట్ చేస్తారని ప్రశ్నించారు.