ఏపీ, తెలంగాణ రాష్ట్రాలలో గురువారం నాడు ఎన్‌ఐఏ విస్తృతంగా సోదాలు చేసింది. తెలుగు రాష్ట్రాల్లో 14 ప్రాంతాల్లో ఎన్ఐఏ అధికారులు సోదాలు నిర్వహించారు. హైదరాబాద్, రాచకొండ, మెదక్, ప్రకాశం, విశాఖపట్నం, విజయవాడ, నెల్లూరు ప్రాంతాల్లో గురువారం ఉదయం నుంచి వారు సోదాలు జరిపారు. 2019 జూన్‌లో ఛత్తీస్ గఢ్‌లో జరిగిన ఎన్‌కౌంటర్ కేస్ దర్యాప్తులో భాగంగా ఈ సోదాలు నిర్వహించారు. అప్పటి కూంబింగ్ ఆపరేషన్‌లో ఆరుగురు మావోయిస్టులతో పాటు ఓ పౌరుడు హతమయ్యారు.
2019 జూన్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌పై పోలీసులు ఎఫ్ఐఆర్ దాఖలు చేయగా… దాని ఆధారంగా 2021 మార్చిలో ఈ కేసును ఎన్ఐఏ టేకప్ చేసింది. ఈ మేరకు సంజు, లక్ష్మణ్, మున్ని, దాషరి పేర్లను ఎన్ఐఏ అధికారులు ఎఫ్ఐఆర్‌లో చేర్చారు. ఈ నేపథ్యంలో గురువారం నిర్వహించిన సోదాల్లో పలు ఎలక్ట్రానిక్ పరికరాలు, అనుమానాస్పద మెటీరియల్, మావోయిస్ట్ సాహిత్య పుస్తకాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
Read Also: మనదేశంలో ఎక్కువ మంది వీక్షిస్తున్న ఓటీటీ ఇదే..!!
కాగా ఎన్‌ఐఏపై సోదాలపై విరసం నేత కళ్యాణ్ రావు మండిపడ్డారు. ఈ దేశంలో ప్రజాస్వామ్యం లేదన్నారు. నియంతల పాలన ఈ దేశంలో నడుస్తుందన్నారు. రాసే హక్కు కవికీ….ప్రశ్నించే హక్కు ప్రతి వ్యక్తికి ఉండాలన్నారు. ఉద్యమం చేసే హక్కు ఉద్యమకారులకు, ప్రజాస్వామిక వాదులకు ఉంటుందన్నారు. అర్ధరాత్రి ఎన్ఐఏ అధికారులు పలువురి ఇళ్ల తలుపులు తడుతూ కుటుంబ సభ్యులను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని కళ్యాణ్ రావు ఆరోపించారు.