హెచ్ పీసీఎల్ రిఫైనరీలో అగ్ని ప్రమాదానికి నిర్లక్ష్యమే కారణం అని కలెక్టర్ కు సమర్పించిన నివేదికలో స్పష్టం చేసింది టెక్నీకల్ కమిటీ. ప్రమాదానికి కారణాలు తెలిపింది. బిటుమిన్ ను తీసుకు వెళ్తున్న 6 ఇంచ్ ల పైపులైను కు 2.5 అంగుళాల నుండి 3 అంగుళాల రంధ్రము ఏర్పడింది. 355 నుండి 400 ఉష్ణోగ్రతల బిటుమిన్ లీకవ్వడంతో మంటలు చెలరేగాయి. 30 మీటర్ల ఎత్తులో ఉన్న పైపు లైన్లు 6 చోట్ల దెబ్బతిన్నాయి. బిటుమిన్ కు హైడ్రోకార్బన్లు తోడవ్వడంతో భారీగా అగ్ని ప్రమాదం జరిగింది. పైపులైను కు మెటీరియల్ ఆఫ్ కన్స్ట్రక్షన్ పై వివరంగా అధ్యయనం చేయవలసి ఉంది అని తెలిపారు.
అయితే ఎస్.ఓ.పి. ప్రకారం నియమిత కాలంలో జరగవలసిన అగ్ని ప్రమాదాల నివారణా, నిర్వహణ షెడ్యూల్ సరిగా అమలు పరచలేదు. Cdu 3 లో 6 అంగుళాల పైప్ లైన్ కు ఆగష్టు 2020 లో అల్ట్రాసోనిక్ పరీక్షను నిర్వహించవలసి ఉండగా నిర్వహించ లేదు.. పైపు లైన్లకు నిర్వహించవలసిన హైడ్రోట్స్ ను ప్రతి నాలుగు సంవత్సరాలకు నిర్వహించవలసి ఉండగా ఆగష్టు 2012 తరువాత జరగలేదు. అధిక ఉష్ణోగ్రతల వద్ద హైడ్రోకార్బన్ లను తీసుకువెళ్లే పైపులైన్ల తుప్పు/ కోతను గుర్తించడంలో విఫలం అయ్యారు. అగ్ని ప్రమాదాల నిర్వహణా షెడ్యూలు సరిగా అమలు పరచలేదు అని పేర్కొన్నారు.