టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ నూతన ఒరవడికి శ్రీకారం చుట్టారు. మాఘమాసంలో ఎక్కువ జరిగే పెళ్లిళ్లు, శుభకార్యాలకు రాజకీయ ప్రముఖులు కూడా హాజరవుతుంటారు. అయితే తమ పార్టీ నేతల అన్ని శుభకార్యాలకు హాజరుకావడం కీలక నేతలకు సాధ్యం కాని విషయం. ఈ నేపథ్యంలో గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గంలో టీడీపీ కార్యకర్తలు చాలా మంది మాఘమాసంలో జరిగే శుభకార్యాలకు హాజరు కావాలని తమ నాయకుడు లోకేష్‌ను ఆహ్వానిస్తున్నారు.
అందరి పెళ్లిళ్లకు వెళ్లడం టీడీపీ నేత నారా లోకేష్‌కు సాధ్యపడటం లేదు. దీంతో ఆయన వినూత్నంగా ఆలోచించి తనను పెళ్లికి ఆహ్వానించిన వారికి ప్రత్యేకంగా ఒక పెళ్లి కానుకను పంపిస్తున్నారు. ఈ కానుకలో భాగంగా వధూవరులకు నూతన వస్త్రాలను అందిస్తున్నారు. వరుడికి తెల్ల ప్యాంట్ షర్ట్, వధువుకు తలంబ్రాల చీరను బహూకరిస్తున్నారు. నియోజకవర్గంలో వివాహాలు చేసుకుంటున్న కార్యకర్తలందిరికీ ఈ కానుకను స్థానిక నేతలు వెళ్లి పెళ్లి మండపంలోనే అందిస్తున్నారు. కాగా గత ఎన్నికల్లో మంగళగిరి నియోజకవర్గంలో లోకేష్ ఓడిపోవడంతో ప్రజలకు దగ్గరయ్యేందుకు లోకేష్ తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నట్లు కనిపిస్తోంది.
