సార్వత్రిక ఎన్నికల్లో అధికారం కోల్పోయిన తెలుగు దేశం పార్టీ.. మళ్లీ పూర్వ వైభవం కోసం ప్లాన్ చేస్తోంది.. ఇప్పటికే ప్రభుత్వ విధానాలను, వైఫల్యాలను ఎండగడుతూ ప్రజల్లోకి వెళ్తోంది.. ఇక, తెలుగు దేశం పార్టీలో కీలక మార్పులు చోటు చేసుకోనున్నాయా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది.. టీడీపీలోకి యంగ్ బ్లడ్ పై పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కీలక సూచనలు చేశారు.. పార్టీలో యువతకు ప్రాతినిధ్యంపై టీడీపీ పొలిట్ బ్యూరో భేటీలో చర్చ లేవనెత్తారు లోకేష్.. దీంతో, ఆయన సూచనలపై సమగ్ర అధ్యయననానికి కమిటీ ఏర్పాటు చేయాలని తెలుగు దేశం పార్టీ పొలిట్ బ్యూరో నిర్ణయం తీసుకుంది… యువతకు ప్రాధాన్యం, యువత భాగస్వామ్యం పెరిగేలా పార్టీ తీసుకోవాల్సిన చర్యలపై నివేదిక ఇవ్వనుంది ఆ కమిటీ.. వచ్చే పొలిట్ బ్యూరో సమావేశం నాటికి పక్కా కార్యాచరణతో వెళ్లేలా లోకేష్ ప్రణాళికలు రచిస్తున్నారట.
పార్టీ సంస్థాగత నిర్మాణంలో భాగంగా సంస్కరణలే కాదు.. యువతకు కీలక భాగస్వామ్యం ఇవ్వాలని నారా లోకేష్ తన వాదనను పొలిట్‌బ్యూరో సమావేశంలో వినిపించారు.. పార్టీలో యువతకు ప్రాధాన్యంపై స్పష్టమైన విధానంతో ముందుకు వెళ్లాలని స్పష్టం చేశారు.. పార్టీలో నూతనత్వం, యువ రక్తం తెచ్చేందుకు కసరత్తును వేగంగా చేపట్టాలని పేర్కొన్నారు. లోకేష్ వాదనలకు అంగీకరించిన టీడీపీ పొలిట్‌బ్యూరో వెంటనే పూర్తిస్థాయిలో అధ్యయనానికి కమిటీ ఏర్పాటు చేసింది.. కాగా, మహానాడుతో పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహాన్ని నింపే ప్రయత్నం ఇప్పటికే జరిగింది.. ముఖ్యంగా యువతకు టీడీపీ నుంచి పిలుపొచ్చింది. పార్టీలో సీనియర్లను పక్కనపెట్టి, దాదాపు 40 శాతం వరకు యువతకు టికెట్లు ఇచ్చి అసెంబ్లీ బరిలోకి దించాలన్న టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ నిర్ణయాన్ని సీనియర్ నేతలు సైతం ప్రశంసలు కురిపించారు.. మరోవైపు వరుసగా మూడు పర్యాయాలు ఎన్నికల్లో ఓడిపోయిన నేతలకు సైతం టీడీపీ టికెట్ ఇచ్చేది లేదని సైతం సంచలన వ్యాఖ్యలు చేశారు లోకేష్. పార్టీలో పదవులు రెండు సార్లు దక్కుతాయని, యువతకు అవకాశం ఇస్తూ పార్టీని మరింత ముందుకు తీసుకెళ్తామని లోకేష్ మహానాడులో స్పష్టం చేశారు… ఇప్పుడు దానిని ఆచరణలో పెట్టేందుకు సిద్ధం అవుతోంది తెలుగుదేశం పార్టీ.