రాజధానిగా అమరావతిని అమలుచేయాలంటూ రైతులు, ప్రజాసంఘాలు చేపట్టిన పాదయాత్రకు కోర్టు అనుమతిచ్చినా పోలీసులు మాత్రం ఆంక్షలు విధిస్తున్నారు. విచ్చలవిడిగా రోడ్లపై రచ్చ చేసే వైసీపీ వాళ్లకు అడ్డురాని కోవిడ్ నిబంధనలు, లౌడ్ స్పీకర్లు రైతుల మహా పాదయాత్రకే అడ్డొచ్చాయా డీజీపీ గారు అంటూ మండిపడ్డారు టీడీపీ నేత, మాజీ మంత్రి నారా లోకేష్.
వైసీపీ ర్యాలీలకు రెడ్ కార్పెట్ వేస్తున్న పోలీసులు అమరావతి రైతుల మహా పాదయాత్రకు అడ్డంకులు కల్పిస్తూ నోటీసులిస్తున్నారు. అమరావతిని చంపేసి ఉద్యమాన్ని అణిచేయాలనే జగన్ ఎన్ని కుయుక్తులు పన్నినా చివరికి భంగపాటు తప్పదు. ఒకే రాష్ట్రం ఒకే రాజధాని జై అమరావతి. తుగ్లక్ నిర్ణయాలతో రైతుల మహా పాదయాత్రకు అడ్డుకోవాలని చూస్తే ఉద్యమం మరింత ఉధృతం అవుతుందని లోకేష్ హెచ్చరించారు.
రైతు పాదయాత్ర నిర్వాహకులకు నోటీసులు ఇచ్చారు పోలీసులు. పాదయాత్ర నిబంధనలు ఉల్లింఘించారని నోటీసుల్లో పేర్కొన్నారు. పాదయాత్రలో 157 మందికి అనుమతిస్తే.. 2500 మంది పాల్గొన్నారని పోలీసులు అన్నారు. రాజకీయ ప్రమేయం ఉండకూడదని కోర్టు ఆదేశాలు ఇచ్చిందన్న పోలీసులు, వాటిని ఉల్లంఘించారని నోటీసుల్లో తెలిపారు.
6వ రోజు పాదయాత్ర ముగిసిన తర్వాత రైతులు బస చేసిన కల్యాణ మండపం వద్దకు చేరుకున్నారు చీరాల డీఎస్పీ. అమరావతి జేఏసీ నేతలు శివారెడ్డి, తిరుపతిరావు, సుధాకర్, పలువురు ప్రజాప్రతినిధులకు నోటీసులు అందజేశారు. దీనిపై వివరణ ఇవ్వాలని ఆదేశించారు.