గన్ కంటే ముందే దూసుకువస్తానన్న జగన్ ఎక్కడా.. ? అంటూ ప్రశ్నించారు నారా లోకేష్.. గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం తుమ్మపూడి వెళ్లిన ఆయన.. దుండగుల అఘాయిత్యానికి బలైన బాధితురాలి కుటుంబాన్ని పరామర్శించారు.. అయితే, లోకేష్ పర్యటన సందర్భంగా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.. ఓ దశలో టీడీపీ-వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు రాళ్లు రువ్వుకున్నాయి.. ఈ ఘటనలో పలువురు పోలీసులు గాయపడ్డారు.. ఇక, బాధితురాలి కుటుంబాన్ని పరామర్శించిన అనంతరం మీడియాతో మాట్లాడిన నారా లోకేష్.. చట్టాలంటే గౌరవం, భయం లేని పరిస్థితులు ఏపీలో ఉన్నాయన్నారు.
Read Also: ATA Convention: సీఎం జగన్‌ను కలిసిన ఆటా ప్రతినిధులు
జగన్ రెడ్డి వెయ్యి రోజుల పాలనలో 800 మందికి పైగా మహిళలపై దాడులు జరిగాయన్నారు నారా లోకేష్.. ఇలాంటి దారుణమైన ఘటన జరిగితే.. గన్ కంటే ముందు వస్తానన్న జగన్ ఎక్కడా ? అని నిలదీసిన ఆయన.. బుల్లెట్ లేని గన్.. జగన్ అని అర్ధమైందని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో అంబేద్కర్ రాజ్యాంగానికి బదులు రాజారెడ్డి రాజ్యాంగం అమలవుతోందని విమర్శించారు. నిన్న హత్యాచారం జరిగే సమయంలో పోలీసులంతా మహిళా కమిషన్ కార్యాలయం వద్ద వాసిరెడ్డి పద్మ గారి సేవలో ఉన్నారని మండిపడ్డారు. ఇక, నాపై రాళ్లు విసిరితే పారిపోతాననుకుంటారా? నేను పారిపోయే రకం కాదన్నారు.. పదిమంది వైకాపా మూకల్ని పోలీసులు కంట్రోల్ చేయలేరా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కొంతమంది పోలీసుల వల్ల వ్యవస్థకే చెడ్డపేరు వస్తోందన్నారు.. పోస్ట్ మార్టం జరగక ముందే సామూహిక అత్యాచారం జరగలేదని ఎస్పీ ఎలా చెప్తారు? అని ప్రశ్నించారు నారా లోకేష్.