Katasani Ram Bhupal Reddy: జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పై వైఎస్సార్సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తిరుపతి లడ్డూ విషయంలో కల్తీ జరగలేదని నిర్ధారణ అయిన నేపథ్యంలో, పవన్ కల్యాణ్ హిందూ సమాజానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. తిరుమల మెట్లను పవన్ కల్యాణ్ పై నుంచి కిందికి.. లేదా కింది నుంచి పైకి.. కడుగుతారా అంటూ ఎద్దేవా చేశారు. లోపల ఒకటి పెట్టుకుని బయట మరోటి మాట్లాడటం సరికాదని, మనసును స్వచ్ఛంగా ఉంచుకోవాలని సూచించారు. నోరు వచ్చినట్టు మాట్లాడకుండా జాగ్రత్త పడాలని హితవు పలికారు.
ఒకే అంశంపై ఒక్కోసారి ఒక్కో మాట మాట్లాడటం కరెక్ట్ కాదని వ్యాఖ్యానించారు కాటసాని.. అమ్మా, నాన్న హారతి ఇచ్చిన సమయంలో సిగరెట్ వెలిగించుకున్న వ్యక్తి సనాతన ధర్మం గురించి మాట్లాడటం ఏమిటని ప్రశ్నించారు. ఇక, మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి చెప్పులు వదిలి తిరుపతి ప్రసాదాన్ని గౌరవంగా స్వీకరించేవారని కాటసాని గుర్తు చేశారు. ఇదే సమయంలో శ్రీశైలంలో కరివేన బ్రాహ్మణ సత్రం ప్రహరీ గోడ కూల్చివేతపై మాజీ ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. నోటీసులు ఇవ్వకుండా ప్రహరీ గోడను కూల్చడం అన్యాయమని అన్నారు. ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి ప్రత్యక్షంగా పర్యవేక్షించి గోడను కూల్చించారని ఆరోపించారు. సొంత ఖర్చులతో ప్రహరీ గోడను తిరిగి నిర్మించి, బాధితులకు క్షమాపణలు చెప్పాలని శిల్ప చక్రపాణి రెడ్డి డిమాండ్ చేశారు.