Chicken Syndicate: ముక్క లేకుంటే ముద్ద దిగాని వాళ్లు చాలా మంది ఉన్నారు. కనీసం వారానికి ఒకసారైనా మసాలా రుచి చూడకుంటే మనసు లాగేస్తుంది. ప్రతీ పూటా నాన్‌వెజ్ లాగించేవారు కూడా ఉన్నారు. ఈ డిమాండ్‌ను ఆసరాగా తీసుకుని నంద్యాల జిల్లాలో చికెన్ సిండికేట్ ఏర్పాటైంది. డోన్‌లో వీరు కోసిందే కోడి..! చెప్పిందే రేటు అన్నట్టు తయారైంది పరిస్థితి. ఉన్న రేటుకన్నా ఎక్కువకు ఇక్కడ సిండికేట్‌గా మారి వ్యాపారులు చికెన్ అమ్ముతున్నారు. ఈ దందా చాన్నాళ్లుగా సాగుతోంది. ఒక వేళ ఎవరైనా తక్కువ రేటుకు అమ్మితే వెంటనే బలవంతంగా దాడులు చేసి షాపులు మూయించేస్తున్నారు.
Read Also: Telangana Cabinet Meeting: నేడు తెలంగాణ కేబినెట్ భేటీ.. కీలక అంశాలపై ఫోకస్..!
డోన్‌లో చికెన్ షాపులు 50కి పైగానే ఉన్నాయి. ప్రతి రోజు 4 వేల నుంచి 5 వేల కిలోల చికెన్ అమ్మకాలు జరుగుతాయి. ఆదివారం ఇది రెండింతలు ఉంటుంది. ఇక్కడ అమ్మే రేటు మరెక్కడా ఉండదు. చికెన్ సిండికేట్లో కిలో పైన 40 నుంచి 50 రూపాయల వరకు అధికంగా వసూలు చేస్తున్నారు. అయితే, వీరితో కలవలేదని TR నగర్‌లో ఒక షాపుపై 6 నెలల క్రితం దాడి చేశారు.. తాజాగా గెలాక్సీ చికెన్ సెంటర్ యజమాని తక్కువ రేటుకు అమ్ముతున్నాడని బలవంతంగా షాపును మూయించేశారు. చికెన్ సిండికేట్ దౌర్జన్యాలపై పోలీస్ స్టేషన్‌లో కేసు పెట్టారు. ఇప్పటికైనా చికెన్ షాపుల ఆగడాలకు అడ్డుకట్ట వేయాలని కోరుతున్నారు స్థానికులు. సిండికేట్‌గా మారి.. అధిక ధరలకు చికెన్ విక్రయించడం ఏంటి? అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.. మరోవైపు, సిండకేట్‌లో చేరని వ్యాపారులపై దాడులు ఏంటి అంటూ మండిపడుతున్నారు..