Maha Shivaratri 2025: శ్రీశైలంలో మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు. తిరుపతి తొక్కిసలాటలో ఆరుగురు మృతి చెందడంతో ప్రభుత్వం అలర్ట్ అయ్యింది… శ్రీశైలం మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలలో భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడంతోపాటు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్తపడుతుంది.. అందుకే ఏర్పాట్లలో మంత్రులను రంగంలోకి దింపింది. మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు ఈసారి ప్రత్యేకతను సంతరించుకున్నాయి. గతంలో ఎన్నడూ లేనంతగా రాష్ట్ర ప్రభుత్వం శ్రీశైలంలో శివరాత్రి బ్రహ్మోత్సవాలపై ఫోకస్ పెట్టింది. ఇంకా చెప్పాలంటే సీఎం చంద్రబాబు శ్రీశైలం శివరాత్రి బ్రహ్మోత్సవాలకు ఈసారి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారు. మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రతియేటా యధావిధిగా జరిగిపోయేవి. ఈవో, జిల్లా అధికారులు, ఉద్యోగులు, జిల్లా మంత్రి, ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే , ఆలయ ఉద్యోగులు మాత్రమే మహా శివరాత్రి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లలో పాల్గొనేవారు. జిల్లా మంత్రి పట్టు వస్త్రాలు సమర్పించే వారు. దేవాదాయ శాఖ మంత్రి శివరాత్రి రోజున వచ్చి దర్శనం చేసుకునే వారు. ఇది ప్రతియేటా జరిగే తీరు.
Read Also: Fire Breaks Out: పాతబస్తీలో భారీ అగ్నిప్రమాదం.. 40 బట్టల దుకాణాలు దగ్ధం
అయితే, ఈ ఏడాది శ్రీశైలంలో జరగనున్న మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలలో సీఎం చంద్రబాబు మొదలుకుని, స్థానిక ఎమ్మెల్యే వరకు పూర్తి స్థాయిలో ఫోకస్ పెడుతున్నారు. తిరుపతిలో ముక్కోటి ఏకాదశి ఉత్తర ద్వార దర్శనం టోకెన్ల పంపిణీలో అపశృతి, ఆరుగురు ప్రాణాలు కోల్పోయిన తరుణంలో ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మహాశివరాత్రి పర్వదినాన ఏపీలో నిర్వహించే వేడుకల్లో శ్రీశైలం ప్రధానమైనది, ప్రత్యేకమైనది కూడా. లక్షలాది మంది భక్తులు శివరాత్రి బ్రమహోత్సవాల్లో పాల్గొంటారు. శివమాల ధరించిన భక్తులే లక్షల్లో వస్తారు. దట్టమైన నల్లమల అటవీ ప్రాంతంలో కాలినడకన శ్రీశైలం చేరుకునే భక్తులే వేల సంఖ్యలో వుంటారు. అందుకనే సీఎం చంద్రబాబు ప్రత్యేక దృష్టి పెట్టినట్టు సమాచారం.
Read Also: GHMC: నేటి నుండి జిహెచ్ఎంసిలో స్టాండింగ్ కమిటీ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ..
శ్రీశైలం మహా శివరాత్రి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను గతంలో ఎన్నడూ మంత్రులు సమీక్షించిన సందర్భాలు లేవు. రాజధాని అమరావతి నుంచే దేవాదాయ శాఖ మంత్రి, కమిషనర్ స్థానిక అధికారులతో మాట్లాడి ఏర్పాట్లను సమీక్షించేవారు. ఈ ఏడాది ఐదుగురు మంత్రులు మహా శివరాత్రి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై సమీక్షకు శ్రీశైలం వస్తున్నారు. ఈరోజు మంత్రులు పయ్యావుల కేశవ్, ఆనం రామనారాయణరెడ్డి, అనగాని సత్యప్రసాద్, అనిత, ఎన్ఎండీ ఫరూక్, బీసీ జనార్దన్ రెడ్డి శ్రీశైలం చేరుకుంటున్నారు. జిల్లా అధికార యంత్రాంగంతో శివరాత్రి ఏర్పాట్లపై సమీక్షించనున్నారు. ఈ శివరాత్రి బ్రహ్మోత్సవాల్లో మరో ప్రత్యేకత ఏంటంటే.. ఈనెల 23న సీఎం చంద్రబాబు భ్రమరాంభ, మల్లికార్జునస్వాముల వారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. ఇప్పటి వరకు ఏ ముఖ్యమంత్రి శివరాత్రి బ్రహ్మోత్సవాల్లో స్వామి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించలేదు. కేవలం జిల్లా మంత్రి పట్టువస్త్రాలు సమర్పించేవారు. సీఎం స్వయంగా స్వామి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తున్నారంటే శ్రీశైలం శివరాత్రి బ్రహ్మోత్సవాలకు ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారో చెప్పకనే తెలుస్తుంది.