Nandamuri Ramakrishna Demands AP Govt To Not Change Health University Name: డా. ఎన్టీఆర్ మెడికల్ హెల్త్ యూనివర్సిటీ పేరును తొలగించడాన్ని స్వర్గీయ ఎన్టీ రామారావు కుమారుడు నందమూరి రామకృష్ట ఖండించారు. ఆ యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరునే కొనసాగించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ యూనివర్సిటీకి మూల కారకుడు, వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ అని పేర్కొన్నారు. అన్ని మెడికల్ కాలేజీలు ఒకే పాలసీతో నడవాలనేది వారి భావన అని.. ఆ ఉద్దేశంతోనే 1986లో ఈ మెడికల్ మెడికల్ హెల్త్ యూనివర్సిటీనీ స్థాపించారని అన్నారు. ఎన్టీఆర్ నిర్ణయం పట్ల అప్పట్లో అన్ని రాజకీయ పార్టీలు, నాయకులు తమతమ మద్దతుతో పాటు హర్షం కూడా వ్యక్తం చేశారన్నారు.
1996లో ఎన్టీఆర్ స్వర్గస్థులయ్యారని, ఆయన స్థాపించిన యూనివర్సిటీ కావడంతో అప్పటి ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు ‘ఎన్టీఆర్’ అనే పదాన్ని సమకూర్చి, ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీగా నామకరణం చేశారని రామకృష్ణ తెలిపారు. అనంతరం రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు.. ఎన్టీఆర్ మీదున్న అభిమానం, గౌరవంతో ఆ వర్సిటీకి డాక్టర్. ఎన్టీఆర్ మెడికల్ హెల్త్ యూనివర్సిటీగా పేరు పెట్టారన్నారు. ఇప్పుడు ఆ పేరుని మార్చడం దురదృష్టకరమన్నారు. ఎన్టీఆర్ పేరును తొలిగించటం.. యావత్ తెలుగు జాతిని అవమానించినట్లేనని ఆగ్రహించారు. అన్ని పార్టీలకు, ప్రాంతాలకు, కులాలకు చెందిన మహా నాయకుడు, యుగపురుషుడు ఎన్టీఆర్ అని.. మన తెలుగు జాతి ఆత్మ గౌరవాన్ని కాపాడి పునర్జింపచేసిన తెలుగు ముద్దుల బిడ్డ ఎన్టీఆర్ అని.. ఆయన పేరునే యూనివర్సిటీకి కొనసాగించాలని కోరారు.