తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.. ఇవాళ తిరుమలలో శ్రీ వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్న ఆయన.. ఆ తర్వాత మీడియాతో మాట్లాడుతూ.. ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.. నేను ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా ఉన్నానని తెలిపారు.. అయితే, నియోజకవర్గ అభివృద్దికి ఎక్కువ నిధులు తీసుకువచ్చిన వ్యక్తిని నేనే అన్నారు కోమటిరెడ్డి… రాబోవు ఏడాదిన్నర కాలం నియోజకవర్గ అభివృద్ది పైనే దృష్టి సారిస్తానని స్పష్టం చేశారు.. ఇదే సమయంలో.. కాంగ్రెస్‌లో కొనసాగుతారా? మరోపార్టీలో చేరతారా? అనే ప్రశ్నపై స్పందించిన ఆయన.. ఎన్నికలకు నెల రోజుల ముందు ఏ పార్టీలో కొనసాగాలి అనేదానిపై నిర్ణయం తీసుకుంటానని తెలిపారు. మరోవైపు, వైఎస్ షర్మిల ఘటనపై స్పందిస్తూ.. షర్మిల ఘటన దురదృష్టకరం, అందరూ ఈ విషయాన్ని ఖండించాలన్నారు.
Read Also: Election Results: గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ ఎలక్షన్ రిజల్ట్స్ లైవ్ అప్డేట్స్
కాగా, కాంగ్రెస్ పార్టీకి గుడ్‌బై చెప్పిన వెంకట్‌రెడ్డి సోదరుడు రాజగోపాల్‌రెడ్డి.. మునుగోడులో ఉప ఎన్నికలో బీజేపీ నుంచి బరిలోకి దిగారు.. ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయం సాధించింది.. అయితే, కాంగ్రెస్ తరపున ఎన్నికల్లో ప్రచారం చేసేందుకు ముందుకు రాలేదు ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి.. బహిరంగసభలు పెట్టినా.. ఆయన హాజరుకాలేదు.. ఇదే, సమయంలో.. పార్టీ చూడకుండా తన సోదరుడికి ఓటు వేయాలంటూ.. కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మాట్లాడిన ఓ ఆడియో సోషల్ మీడియాకు ఎక్కింది.. త్వరలోనే నేను పీసీసీ చీఫ్‌ను అవుతానని.. కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకొస్తానని.. అప్పుడు ఏదైనా ఉంటే చూసుకుంటానని.. ఓ కాంగ్రెస్ కార్యకర్తకు హామీ ఇచ్చారు.. ఆ తర్వాత విదేశీ పర్యటనకు వెళ్లిన ఆయన.. మునుగోడులో కాంగ్రెస్ పార్టీ గెలిచేది లేదని ఎన్నికలకు ముందే తేల్చేశారు.. ఆ వీడియో కూడా వైరల్‌గా మారిపోయింది.. ఈ వ్యవహారం అధిష్టానం దృష్టి వరకు వెళ్లడం.. ఆయనకు నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది.. అయితే, ఇప్పుడు ఏ పార్టీలో ఉండాలనేది ఎన్నికలకు నెలరోజుల ముందు చెబుతానంటూ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు చర్చగా మారాయి.