విజయవాడలోని పీడబ్ల్యూ గ్రౌండ్ లో అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్న ప్రదేశాన్ని మంత్రుల బృందం సోమవారం సందర్శించింది. మంత్రులు పినిపే విశ్వరూప్, వెల్లంపల్లి శ్రీనివాస్, ఆదిమూలపు సురేష్ లతో పాటు అధికారులు స్థలాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా మంత్రలు మాట్లాడుతూ.. అంబేద్కర్ విగ్రహం ఏర్పాటుకు నిధులను గ్రీన్ ఛానల్ లో పెడతాం అని సీఎం హామీ ఇచ్చారని, 12.5 అడుగుల మోడల్ విగ్రహాన్ని ఏర్పాటు చేశామని వారు తెలిపారు. 25 అడుగుల నమూనా విగ్రహం త్వరలో పెడతామని, వచ్చే సంవత్సరం ఏప్రిల్ లో కాంశ్య విగ్రహం ఏర్పాటు చేయనున్నట్లు వారు వెల్లడించారు. విగ్రహానికి రూపురేఖలు ఐఐటీ చెన్నై వారు ఇస్తున్నారని, మొత్తం విగ్రహానికి 268 కోట్ల నిధుల కేటాయించినట్లు వారు పేర్కొన్నారు.
సీఎం జగన్ హామీ ప్రకారం 125 అడుగుల కాంశ్య విగ్రహం నెలకొల్పుతామని, దీని కోసం 20 ఎకరాల స్థలం కేటాయించామని, ఈ ప్రాంగణానికి బీఆర్ అంబేద్కర్ స్వరాజ్ మైదాన్ గా పేరు పెడతామన్నారు. ఏపీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ కు నిర్మాణ బాధ్యతలు ఇచ్చామని, 2023 అంబేద్కర్ జయంతికి ఈ విగ్రహం ప్రారంభించాలని సీఎం చెప్పారన్నారు. సీఎం జగన్ ఒక కమిటీ వేసి ఈ విగ్రహ నిర్మాణం చేయాలని సంకల్పించారని, 20 వేల మీటర్ల ఆడిటోరియంలో 3 వేల మంది ఒకేసారి వినియోగించుకునేలా ఉంటుందని వారు తెలిపారు. చంద్రబాబు ఈ విగ్రహాన్ని ఎక్కడో పొలాల్లో, పుట్టల్లో పెట్టాలనుకున్నాడని, సీఎం జగన్ అందరికీ అందుబాటులో ఉండేలా అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేస్తున్నారన్నారు.