కృష్ణాజిల్లా మచిలీపట్నంలోని మైనార్టీ గురుకుల పాఠశాలలో అస్వస్థతకు గురైన విద్యార్థుల గురించి విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ అధికారులతో మాట్లాడి వివరాలను తెలుసుకున్నారు. జలుబు, తీవ్ర జ్వరం లక్షణాలతో ప్రభుత్వ ఆస్పత్రిలో 14 మంది విద్యార్థులు చేరారు. వాతావరణ మార్పులతో వచ్చే వైరల్ జ్వరాలతోనే అస్వస్థతకు గురైనట్టు అధికారులు మంత్రికి తెలిపారు. వారికి మెరుగైన వైద్య సదుపాయాలను కల్పించాలని మంత్రి అధికారులను ఆదేశించారు. విద్యా, వైద్య శాఖ అధికారుల సమన్వయంతో పని చేయాలని ఆయన సూచించారు. పశ్చిమ గోదావరి జిల్లాలోని విద్యార్థుల అస్వస్థత పై నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు.
వైద్య సేవల్లో ఎలాంటి నిర్లక్ష్యం లేకుండా విద్యార్థులకు వైద్యం అందించాలని వైద్య, విద్యా శాఖ అధికారులకు సూచించారు. పిల్లల ఆరోగ్యానికి సంబంధించి అప్రమత్తంగా ఉండాలని, ఎలాంటి అనారోగ్య సమస్యలు వారికి తలెత్తకుండా చూడాల్సిన బాధ్యత హస్టల్ వార్డెన్‌లు, ఉపాధ్యాయులదేనని మంత్రి అన్నారు. ప్రభుత్వం విద్యార్థుల భవిష్యత్ కోసం కోట్ల రూపాయను ఖర్చు చేస్తుందని ఆయన తెలిపారు. ఏ ఒక్కరూ నిర్లక్ష్యంగా వ్యవహరించినా శాఖ పరమైన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు మంత్రి ఆదిమూలపు సురేష్.