టీడీపీ అధినేత చంద్రబాబుపై మరోసారి మంత్రి కొడాలి నాని తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. విదేశాలకు ఏపీ దాన్యం ఎగుమతి అవుతోందని.. కిలో రూ.25కే ప్రభుత్వం ఎగుమతి చేస్తోందని చంద్రబాబు తోక పత్రికలో రాశారని… రైతుల శ్రమను దోచుకుంటున్నారని ఆరోపణలు చేశారని మంత్రి కొడాలి నాని మండిపడ్డారు. చంద్రబాబును సీఎం చేయాలనే ఇలాంటి తప్పుడు రాతలు రాస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబును సీఎం చేసేవరకు ఆయనకు తోకలుగా ఉన్న పార్టీలు, తపించే పత్రికలకు నిద్ర పట్టడం లేదని ఎద్దేవా చేశారు.
సీఎం జగన్ గారిని భ్రష్టు పట్టించాలని కంకణం కట్టుకున్నారని.. కాకినాడ నుంచి ఎగుమతి అయ్యే బియ్యం ఒక్క ఏపీ నుంచే కాదు బీహార్, ఒడిశా, తమిళనాడు, ఛత్తీస్‌గఢ్ వంటి రాష్ట్రాల నుంచి కూడా ఎగుమతి అవుతున్నట్లు మంత్రి కొడాలి నాని గుర్తుచేశారు. తమ ప్రభుత్వం వచ్చాక అనేక మార్పులు చేశామని.. రైతులు ఏ పంట వేశారో ఈ క్రాప్ బుకింగ్ చేస్తున్నామని తెలిపారు. అన్ని రికార్డులు ఆన్లైన్లోనే ఉంటాయన్నారు. గతంలో ధాన్యాన్ని మిల్లులో కొనుగోలు చేస్తే తాము రైతు భరోసా కేంద్రాల్లో కొనుగోలు చేస్తున్నామని పేర్కొన్నారు. పేదల కోసం పనిచేసే సీఎంపై ఇన్ని అబద్ధాలు ప్రచారం చేయడం దారుణమన్నారు. విజయవాడలో బెంజ్ సర్కిల్ వద్ద ఫ్లైఓవర్‌ను తమ ప్రభుత్వం వచ్చాక మంజూరు చేయించి పూర్తి చేశామన్నారు. మొత్తం 51 ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేసింది చంద్రబాబుకి కనపడటం లేదా అని ప్రశ్నించారు. సీఎం జగన్ బలపడతారని చంద్రబాబు దొంగ ఏడుపులు ఏడుస్తున్నాడని ఆరోపించారు. చంద్రబాబు ఎంతమంది డీజీపీలను, ఎంతమంది చీఫ్ సెక్రటరీలు మార్చాడో చెప్పాలన్నారు.
సవాంగ్ గారు వచ్చి చాలా కాలమైందని.. వేరే వారికి అవకాశం ఇవ్వాలని ప్రభుత్వం డీజీపీని మార్చిందని కొడాలి నాని వివరణ ఇచ్చారు. ప్రజలు అమాయకులు కాదని.. జగన్ గారిని భ్రష్టు పట్టించడం చంద్రబాబు వల్ల కాదని కొడాలి నాని అన్నారు. ఎన్టీఆర్ చావుకు కారణమై సీఎం పదవి తెచ్చుకుని.. దానిని అడ్డం పెట్టుకుని చంద్రబాబు కుబేరుడు అయ్యాడని కొడాలి నాని తీవ్ర విమర్శలు చేశారు. వివేకా హత్య కేసులో ఛార్జిషీట్ విషయంలో ఎవరికి నచ్చిన అంశం వాళ్లు బయటకు తెస్తున్నారని.. ఆరోజు జగన్ కేసులో అప్పుడున్న జేడీ కూడా తమకు కావాల్సిన పత్రికలకు లీకులు ఇచ్చేవాడని ఆరోపించారు. వివేకాను హత్య చేయిస్తే జగన్‌కు ఏం వస్తుందని కొడాలి నాని ప్రశ్నించారు. వాళ్లు దేవుడిని నమ్ముకున్న కుటుంబం అని.. అలాంటి కుటుంబాన్ని రోడ్డుమీదకు లాక్కొచ్చిన వాళ్లు టీడీపీ వాళ్లు అని మండిపడ్డారు. పదవులు శాశ్వతం కాదు అని.. చరిత్ర శాశ్వతం అని చంద్రబాబు గుర్తించాలన్నారు. ఎన్టీఆర్, వైఎస్ఆర్ తరహాలో జగన్ కూడా చరిత్రలో నిలిచే పనులు చేస్తున్నారని కొనియాడారు. కొడుకును ఎమ్మెల్యేగా, కుప్పంలో సర్పంచ్‌ను గెలిపించుకోలేని వ్యక్తి సొల్లు పురాణం చెప్తున్నాడని చంద్రబాబుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.