Karumuri Nageswara Rao: మంత్రి కారుమూరి నాగేశ్వరరావు కీలక వ్యాఖ్యలు చేశారు. విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. జగన్ సింహాం లాంటోడు అని.. ఎన్నికలకు సింగిల్‌గానే వెళ్తాడని స్పష్టం చేశారు. కేసీఆర్ కాదు కేసీఆర్ తాత వచ్చినా తమకు వచ్చే నష్టమేమీ లేదన్నారు. అటు అమరావతి రైతుల పాదయాత్ర గురించి మాట్లాడుతూ.. రిస్టు వాచీలు, బెంజ్ కారులు పెట్టుకున్న వాళ్ళు చేస్తున్న పాదయాత్ర అని మండిపడ్డారు. భార్యలు కాదు భర్తలు బయటకు వస్తే ముసుగు తొలగిపోతుందన్నారు. రైతుల ముసుగులో టీడీపీ నేతలు ఈ యాత్ర చేస్తున్నారని మంత్రి కారుమూరి నాగేశ్వరరావు ఆరోపించారు. గోదావరి జిల్లాల్లో పాదయాత్రను స్వాగతిస్తోంది ప్రజలు కాదని.. టీడీపీ కార్యకర్తలు అని అన్నారు.
Read Also: Ravan Dahan: ఇదెక్కడి విడ్డూరం.. రావణుడి పది తలలు దగ్ధం కాలేదని గుమస్తాపై వేటు
అటు వచ్చే ఎన్నికల్లో ఎన్ని పార్టీలు ఏకమైనా తమను నష్టమేమీ లేదని మంత్రి కారుమూరి నాగేశ్వరరావు వ్యాఖ్యానించారు. తమకు కలిసొచ్చే ఓటు తప్ప చీలిపోయేది ఉండదన్నారు. రాజధాని పేరుతో చంద్రబాబు బొమ్మ చూపించాడని.. దౌర్జన్యంగా రైతుల భూములు స్వాధీనం చేసుకున్న చరిత్ర చంద్రబాబుది అని విమర్శించారు. వచ్చే మార్చి నుంచి అన్ని జిల్లాలలోను పోర్టిఫైడ్ రైస్ పంపిణీ చేస్తామన్నారు. ఖరీఫ్ సీజన్‌లో 40లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యమన్నారు. ధాన్యం కొనుగోలులో రైతు నష్టపోకుండా మిల్లర్ల ప్రమేయం లేకుండా చర్యలు తీసుకుంటామన్నారు. ధాన్యం కొనుగోలులో ఎక్కడా పేమెంట్ ఆలస్యం కాలేదన్నారు. గతంలో రేషన్ సరఫరా 85 శాతం ఉండేదని.. ఇప్పుడు 92 శాతానికి చేరుకుందన్నారు. ఎరువుల దుకాణాల్లో కొలతల లోపాలు బయటపడ్డాయని.. తనిఖీలు చేసి 189 కేసులు పెట్టామని మంత్రి కారుమూరి నాగేశ్వరరావు వివరించారు. మిగతా రాష్ట్రాలతో పోలిస్తే మన రాష్ట్రంలో నిత్యావసర వస్తువులు ధరలు తక్కువ ఉన్నాయన్నారు. బంగారం అమ్మకాల్లో లోపాలు తమ దృష్టికి వచ్చాయని.. త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా తనిఖీలు చేస్తామని పేర్కొన్నారు.