Jogi Ramesh: ఆదివారం నాడు వైసీపీపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి జోగి రమేష్ స్పందించారు. రాష్ట్రంలో అన్ని పార్టీలు కలిసివచ్చినా వైసీపీ కంచుకోటను ఇంచుకూడ కదలించలేరని ఆయన వ్యాఖ్యానించారు. పవన్ కళ్యాణ్ ఒక రాజకీయ అజ్ఞాని అని ఎద్దేవా చేశారు. జనసేనను సైకో సేనగా మంత్రి జోగి రమేష్ అభివర్ణించారు. పవన్ లాంటి సైకోగాళ్లు నెలకోసారి వచ్చి ప్రజలను రెచ్చగొట్టి వెళ్తుంటారని మండిపడ్డారు. ఈ సైకోలు రాత్రిపూట సంచరించే రౌడీలు, గుండాలు, పొరంబోకులు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
Read Also: Tirumala: భక్తులకు శుభవార్త.. అందుబాటులో 2023 డైరీలు, క్యాలెండర్లు
వైసీపీ నేతల ఇళ్లు కూలుస్తానని పవన్ కళ్యాణ్ చెప్పడం హాస్యాస్పదంగా ఉందని మంత్రి జోగి రమేష్ అన్నారు. ఇదేమన్నా సినిమా సెట్టింగ్ అనుకుంటున్నావా లేదా విఠలాచార్య అట్ట మోపింగ్ అనుకుంటున్నావా అని పవన్‌ను ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్ రాష్ట్రంలో ఎక్కడ పోటీ చేసినా ఓడించి తీరుతామని స్పష్టం చేశారు. పవన్ కళ్యాణ్‌కు ధైర్యం ఉంటే 175 నియోజకవర్గాల్లో తమ పార్టీ అభ్యర్థులను నిలబెడతానని చెప్పాలని సవాల్ విసిరారు. తానే ముఖ్యమంత్రి అభ్యర్థిని అని ప్రకటించే ధైర్యం పవన్ కళ్యాణ్‌కు ఉందా అని సూటిగా ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్‌కు సత్తా ఉంటే ఒంటరిగా పోటీ చేస్తానని చెప్పాలన్నారు. కోడి కత్తి రాజకీయాలు అనే విమర్శలకు ప్రజలే 151 స్థానాలు వైసీపీకి ఇచ్చి సమాధానం చెప్పారని మంత్రి జోగి రమేష్ పేర్కొన్నారు.
మరోవైపు వైసీపీ ప్రభుత్వంపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై మంత్రి బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. పిట్ట కొంచెం.. కూత ఘనంగా ఆయన వ్యాఖ్యలున్నాయన్నారు. ఇప్పటం గ్రామంలో అభివృద్ధి కోసం రోడ్లు విస్తరిస్తుంటే ఆయనకు అభ్యంతరమేంటని ప్రశ్నించారు. 2019 ఎన్నికల్లో పవన్ సత్తా ఏంటో అర్థమైందన్నారు. 2009లో అన్న ప్రజారాజ్యం పార్టీలో ఏం చేశారో చూశామని, ఇప్పుడు కొత్తగా పవన్ ఏం చేయగలరని ఎద్దేవా చేశారు. అటు మంత్రి అంబటి రాంబాబు ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ.. ఏమీ లేని ఆకు ఎగిరి ఎగిరి పడినట్లు పవన్ కళ్యాణ్ వైఖరి ఉందంటూ చురకలు అంటించారు.
ఏమీ లేని ఆకు ఎగిరి ఎగిరి పడుతుంది!
పవన్ బాబు కూడా అంతే !— Ambati Rambabu (@AmbatiRambabu) November 27, 2022