Tirumala: మరో 35 రోజుల్లో నూతన సంవత్సరం వచ్చేస్తోంది. ప్రజలందరూ 2022కు వీడ్కోలు పలికి 2023కు స్వాగతం పలకనున్నారు. ఈ నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం కూడా నూతన సంవత్సర డైరీలు, క్యాలెండర్లను భక్తులకు అందుబాటులో ఉంచింది. కావాల్సిన భక్తులకు ఆన్‌లైన్‌లో వీటిని అందజేసేలా టీటీడీ ఏర్పాట్లు చేపట్టింది. ఆన్‌లైన్‌లో బుక్ చేసుకున్న వాళ్లకు పోస్టు ద్వారా పంపుతామని టీటీడీ వెల్లడించింది. భక్తులు tirupatibalaji.ap.gov.in వెబ్‌సైట్‌లో ‘పబ్లికేషన్స్’ అనే ఆప్షన్‌ను క్లిక్ చేసి డెబిట్‌కార్డు, క్రెడిట్ కార్డుల ద్వారా బుక్ చేసుకోవచ్చని సూచించారు. ఆఫ్‌లైన్‌లో క్యాలెండర్లు, డైరీలు కొనుగోలు చేయాలని భావించిన వారు తిరుమలలోని శ్రీవారి ఆలయం ఎదురుగా, లేపాక్షి ఎదుట, అన్నదాన భవనంలోని పుస్తక విక్రయశాలలతో పాటు తిరుపతిలోని గోవింద రాజ స్వామివారి ఆలయం వద్దగల ధ్యానమందిరం, రైల్వేస్టేషన్, శ్రీనివాసం, విష్ణునివాసం, తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం వద్ద గల పుస్తక విక్రయశాలల్లో సంప్రదించాలని టీటీడీ అధికారులు సూచించారు.
Read Also: Pawan Kalyan : గాంధీ, అంబేద్కర్ కంటే వైఎస్సార్ గొప్ప వ్యక్తి కాదు
అంతేకాకుండా విజయవాడ, విశాఖ, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, న్యూఢిల్లీ, ముంబైలోని టీటీడీ సమాచార కేంద్రాల్లోనూ క్యాలెండర్లు, డైరీలను అందుబాటులో ఉంచామని టీటీడీ తెలిపింది. 12 పేజీల క్యాలెండర్ ధర రూ.130, డీలక్స్ డైరీ రూ.150, చిన్న డైరీ రూ.120, టేబుల్ టాప్ క్యాలెండర్ రూ.75, శ్రీవారి పెద్ద క్యాలెండర్ రూ.20, శ్రీపద్మావతి అమ్మవారి క్యాలెండర్ రూ.20, శ్రీవారు, శ్రీపద్మావతి అమ్మవారి క్యాలెండర్ రూ.15, తెలుగు పంచాంగం క్యాలెండర్ రూ.30గా నిర్ణయించినట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు. అటు ఒంటిమిట్టలోని శ్రీ కోదండరామస్వామివారి ఆలయం, దేవుని కడపలోని శ్రీ లక్ష్మీ వేంకటేశ్వర స్వామివారి ఆలయాలతో పాటు నెల్లూరు, రాజమండ్రి, కాకినాడ, కర్నూలు, నంద్యాల, హన్మకొండలోని టీటీడీ కల్యాణమండపాల్లోనూ క్యాలెండర్లు, డైరీలు అందుబాటులో ఉన్నాయి. టీటీడీ క్యాలెండర్, డైరీలకు సంబంధించిన ఇతర సమాచారం కోసం భక్తులు 9963955585, 0877-2264209 నంబర్లలో సంప్రదించవచ్చు.