Gudivada Amarnath: ఏపీ రాజధానిపై హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లాలని నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ అంశంపై మంత్రి గుడివాడ అమర్నాథ్ స్పందించారు. వికేంద్రీకరణ విధానానికి బలం చేకూర్చే విధంగా సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేశామని తెలిపారు. రాష్ట్రానికి ఉన్న రాజ్యాంగపరమైన హక్కులను గుర్తు చేయడం కోసమే సుప్రీంకోర్టుకు వెళ్లామన్నారు. మూడు రాజధానులకు న్యాయపరమైన అనుతులు పొందే దిశగా సుప్రీంకోర్టును ఆశ్రయించడం తొలి అడుగు అన్నారు. వికేంద్రీకరణపై హైకోర్టు ఇచ్చిన తీర్పు ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమనే విషయం ఎస్.ఎల్.పీలో ప్రస్తావించామని మంత్రి గుడివాడ అమర్నాథ్ తెలిపారు. రాజధాని ఏర్పాటు రాష్ట్ర ప్రభుత్వం పరిధిలోనిదని రాజ్యాంగం చెబుతోందని.. మూడు రాజధానులపై రాష్ట్రం చేసిన చట్టాన్ని చెల్లదు అనే హైకోర్టు తీర్పును సర్వోన్నత న్యాయస్థానం దృష్టికి తీసుకువెళ్లామని పేర్కొన్నారు.
Read Also:BCCI: మహ్మద్ షమీని అందుకే ప్రపంచకప్ తుదిజట్టులోకి తీసుకోలేదు
కాగా విభజన చట్టం సెక్షన్-6 ప్రకారం నియమితులైన శివరామకృష్ణన్ కమిటీ నివేదిక ఇవ్వక ముందే అమరావతిని అప్పటి ప్రభుత్వం రాజధానిగా ప్రకటించిందని మంత్రి గుడివాడ అమర్నాథ్ ఆరోపించారు. నారాయణ కమిటీ ఇచ్చిన నివేదిక ప్రకారం అమరావతిని ప్రకటిస్తే అది ప్రభుత్వానికి వ్యతిరేకమనేది సుప్రీంకోర్టుకు తీసుకుని వెళ్లామని తెలిపారు. మూడు రాజధానులు బిల్లును వెనక్కి తీసుకున్న తర్వాత వచ్చిన హైకోర్టు తీర్పు వచ్చిందని.. అదే విషయం సుప్రీంకోర్టుకు చెప్పామని పేర్కొన్నారు. మరోవైపు రాజధానిపై వైసీపీ సర్కారు సుప్రీంకోర్టుకు వెళ్లిన విషయంపై టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ కూడా స్పందించారు. ఈ మేరకు ఏక వాఖ్యంతో ఆయన ట్వీట్ చేశారు. ‘ధర్మం అంతర్జాతీయ కోర్టుకు వెళ్లినా అంతిమ విజయం న్యాయానిదే’ అని నారా లోకేష్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు.