ఏపీలో ప్రస్తుతం కల్తీ మద్యం, కల్తీ సారాపై అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఈ నేపథ్యంలో టీడీపీ నేతలపై మంత్రి అప్పలరాజు తీవ్ర విమర్శలు చేశారు. పచ్చపార్టీ వాళ్లు లిక్కర్ బ్రాండ్లపై ఆరోపించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ప్రెసిడెంట్ మెడల్ విస్కీ, గవర్నర్స్ రిజర్వ్ విస్కీ వంటి మద్యం బ్రాండ్‌లకు 2018 ఫిబ్రవరి 6న అప్పటి సీఎం చంద్రబాబే అనుమతులు ఇచ్చారని మంత్రి అప్పలరాజు గుర్తుచేశారు. భూమ్.. భూమ్ బీర్ కంపెనీకి 2019 మే 14న అనుమతులు ఇచ్చింది అప్పటి ఆపద్ధర్మ ముఖ్యమంత్రి చంద్రబాబు కాదా అని నిలదీశారు.
టీడీపీ హయాంలో అయ్యన్న పాత్రుడు, వై.రామకృష్ణ, సుజనా చౌదరి లిక్కర్ అమ్మారని మంత్రి అప్పలరాజు ఆరోపించారు. ఇప్పుడు టీడీపీ నేతలు ఏం ముఖం పెట్టుకుని మద్యం బాటిల్స్‌తో ధర్నాలు చేస్తున్నారని.. వారికి సిగ్గులేదా అని ప్రశ్నించారు. చేయాల్సిన చండాలమంతా చేసి తమకు ఏ సంబంధం లేదనడం ఎంత వరకు సమంజసమని అడిగారు. తన హయాంలో అనుమతులు జారీ చేసిన బ్రాండ్‌ల వల్ల ప్రజలకు నష్టం జరుగుతుందని రోడ్డు మీదకు వచ్చి చంద్రబాబు ఒప్పుకోవాలని డిమాండ్ చేశారు. హైవోల్టేజీ గోల్డ్ మద్యం బ్రాండ్‌కు కూడా 2017 జూన్ 7న చంద్రబాబే అనుమతులు ఇచ్చారన్నారు. టీడీపీ నేతలు ధర్నాలు , డ్రామాలు చేస్తుంటే ప్రజలు అసహ్యించుకుంటున్నారన్నారు. రాష్ట్రంలో ఉన్న వేలాది బ్రాందీ షాపులను నిర్మూలించిన ఘనత సీఎం జగన్‌దే అన్నారు. అనాథరైజ్డ్ విస్కీ, బెల్ట్ షాపులను నియంత్రించేందుకు స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరోను ఏర్పాటు చేసిన ఘనత వైసీపీ ప్రభుత్వానిది అని మంత్రి అప్పలరాజు స్పష్టం చేశారు.