మత్స్యకారులపై టీడీపీ, జనసేనలు కపట ప్రేమ చూపిస్తున్నాయని మండిపడ్డారు మంత్రి సీదిరి అప్పలరాజు. టీడీపీకి బీ టీమ్‌గా జనసేన, చంద్రబాబు దత్తపుత్తుడుగా పవన్ కళ్యాణ్ పనిచేశారు తప్ప స్వతంత్రంగా వ్యవహరించట్లేదు. ఏటా రూ. 10 వేలు చొప్పున మత్స్యకార భరోసా సీఎం జగన్ ఇస్తున్నారు. మత్స్యకారులకు చంద్రబాబు చేసిందేమిటో చెప్పాలన్నారు.
మత్స్యకారుడికి నేరుగా డీజిల్ సబ్సిడీ ఇస్తున్నాం. ప్రమాదవశాత్తూ మత్స్యకారుడు చనిపోతే. రూ.10 లక్షల పరిహారం అందిస్తున్నాం. మత్స్యకారులంటే బాబుకు ఎప్పుడూ చులకనే. అందుకే పవన్ కళ్యాణ్‌ను ముందుకు నెట్టి డ్రామాలు ఆడిస్తున్నారు. మత్స్యకారులకు చంద్రబాబు చేసిన మోసాన్ని, హేళనగా మాట్లాడిన మాటల్ని మర్చిపోం. ఏనాడూ మత్స్యకారులకు బాబు మేలు చేయలేదు. బాబు హయాంలో మత్స్యకారులకు ఏం చేయలేదని, ఇప్పుడు మేలు జరుగుతోందని తెలిసి కూడా ఈ డ్రామాలు ఏంటి పవన్?
పవన్ కళ్యాణ్ వస్తే రాష్ట్రంలో నిర్మిస్తున్న నాలుగు ఫిషింగ్ హార్బర్లను చూపిస్తాను. లేదంటే నాదెండ్ల మనోహరే వెళ్లి పరిశీలించవచ్చు. మత్స్యకారుల జీవన ప్రమాణాలను పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోంది. అందుకే ఫిష్ రిటైల్ ఔట్‌లెట్లు, ఫిష్ ఆంధ్రా బ్రాండెడ్ ఔట్‌లెట్లు. మత్స్యకార మహిళలకు గౌరవం దక్కేలా చేపల అమ్మకానికి రిటైల్ ఔట్‌లెట్లు, మార్కెటింగ్ అవకాశాలు కల్పిస్తే జనసేన నేతలు అవహేళన చేస్తారా? నవరత్నాల ద్వారా ప్రతి మత్స్యకార కుటుంబాన్ని ఆదుకునేలా సీఎం జగన్ కృషి చేస్తున్నారని వివరించారు మంత్రి అప్పలరాజు.
ప్రతి మత్స్యకారుడు చదువుకునేలా, వారికి సొంత ఇల్లు ఉండేలా ప్రభుత్వం చేస్తోంది. మత్స్యకార మహిళలకు గౌరవం వచ్చేలా.. వారి కాళ్లపై నిలబడేలా రిటైల్ ఔట్‌లెట్ ఏర్పాటు చేస్తే అవహేళనలా? మత్స్యకారుల కష్టాలు తెలుసు కాబట్టే… మత్స్యకారులకు అన్నివిధాలా అండగా సీఎం వైఎస్ జగన్ వున్నారని రెండు పార్టీలపై మండిపడ్డారు.