AppalaRaju: జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై మంత్రి సిదిరి అప్పలరాజు తీవ్ర విమర్శలు చేశారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పవన్ పగటి వేషగాడిలా ఉన్నాడని ఆరోపించారు. గ్రామాల్లో పండగల సమయంలో పగటి వేషగాళ్లు వస్తారని.. ఇప్పుడు పవన్ కూడా అలాగే వచ్చాడని ఎద్దేవా చేశారు. ఉత్తరాంధ్రలో వెనుకబాటుతనంపై 2019 తర్వాత అని పవన్ మాట్లాడుతున్నాడని.. 2014 నుంచి 2019 వరకు పవన్ ఎందుకు ప్రశ్నించడం లేదని నిలదీశారు. పవన్ యజమాని చంద్రబాబు అని.. 2014 నుంచి 19 వరకు మాట్లాడొద్దు అని చెప్పాడా అని ప్రశ్నించారు. మాట్లాడితే చంద్రబాబు ప్యాకేజీ తగ్గిస్తా అన్నాడా పవన్ అని సూటి ప్రశ్న వేశారు.
మత్స్యకారుల వలసలపై పవన్ కళ్యాణ్‌కు అసలు అవగాహన ఉందా అని మంత్రి అప్పలరాజు ప్రశ్నించారు. స్వాతంత్రం వచ్చాక ఎవరైనా హార్బర్ల ఏర్పాటుపై దృష్టి పెట్టారా అని అడిగారు. కానీ సీఎం జగన్ మాత్రమే ఈ అంశంపై దృష్టి పెట్టారని.. ఇప్పటికే కొన్ని హార్బర్లకు శంకుస్థాపనలు జరిగాయన్నారు. మారికొన్ని హార్బర్లకు శంకుస్థాపన త్వరలో జరుగుతుందని మంత్రి అప్పలరాజు వివరించారు. మత్స్యకారుల జీవితాల్లో జగన్ దేవుడిగా మిగులుతాడని కొనియాడారు. 9 హార్బర్లు అందుబాటులోకి తెచ్చిన ఘనత జగన్‌దే అన్నారు.
Read Also: Tollywood: జనవరి 14న హిస్టరీ రిపీట్ అవుతుందా?
పవన్ కళ్యాణ్‌ది అసలు నిజమైన రాజకీయమేనా అని అప్పలరాజు నిలదీశారు. చంద్రబాబు పంపిన స్క్రిప్టునే పవన్ చదువుతున్నాడని ఎద్దేవా చేశారు. పవన్ సభకు యువశక్తి అని పేరుపెట్టారని.. అటు లోకేష్ పాదయాత్ర పేరు యువగళం అని.. పవన్ సభకు కూడా చంద్రబాబే పేరు పెట్టి ఉంటారని అనుమానం వ్యక్తం చేశారు. ఎన్నికల్లో తనకు గ్యారంటీ ఇవ్వరని కార్యకర్తలను పవన్ అంటున్నాడని.. అతడికి వీరమరణం అవసరమా అని ప్రశ్నించారు. వచ్చే ఎన్నికల్లో రెండు జెండాలు పట్టుకునేందుకు సిద్ధంగా ఉండాలని జనసేన కార్యకర్తలకు పవన్ చెప్పాలన్నారు. అభిమానుల ఆశయాన్ని పవన్ తాకట్టు పెట్టేశాడని.. చంద్రబాబుకు అమ్మేశాడని అప్పలరాజు విమర్శలు చేశారు. పవన్ అభిమానులు, కార్యకర్తలు ఈ విషయాన్ని గమనించాలని హితవు పలికారు. జగన్ సింహం లాంటోడని.. ఎంతమంది కలిసినా ఏం చేయలేరని స్పష్టం చేశారు.