Minister Appala Raju: ఏపీ రాజధాని అమరావతిపై మంత్రి సిదిరి అప్పలరాజు తీవ్ర ఆరోపణలు చేశారు. అమరావతి రైతుల పాదయాత్ర పేరుతో టీడీపీ నేతలు అమరావతి నుంచి అరసవల్లి యాత్ర అంటూ చేపట్టారని ఆరోపించారు. ఒక సామాజిక వర్గం వారే ఈ పాదయాత్రను తలపెట్టారని.. గతంలో తిరుపతి యాత్రలో శాంతి భద్రతలకు విఘూతం కల్పించారని మండిపడ్డారు. అమరావతి రైతుల పాదయాత్ర విశాఖపై దండయాత్ర కోసమేనా అంటూ మంత్రి అప్పలరాజు ప్రశ్నించారు. వాళ్ల అమరావతి యాత్రనా లేదా విశాఖపై దౌర్జన్య యాత్రనా అని నిలదీశారు. చంద్రబాబు ముసి ముసి నవ్వులు నవ్వుకుంటున్నారని.. తమ మనసులను గాయపర్చమని రైతులను ఉసిగొల్పుతున్నారని విమర్శలు చేశారు.
పాదయాత్ర పేరిట ప్రజల్ని రెచ్చగొట్టాలని చూస్తే ఖబడ్దార్ అంటూ మంత్రి అప్పలరాజు హెచ్చరించారు. ఉత్తరాంధ్ర ప్రజలు ఆగ్రహావేశాలను విశాఖ ఎయిర్‌పోర్టులో చంద్రబాబు ఒకసారి రుచిచూశారని.. ఉత్తరాంధ్ర ఎప్పటికీ వెనుకబడే ఉండాలన్నది ఆయన ఉద్దేశమా అంటూ ప్రశ్నించారు. ఉత్తరాంధ్రను జగన్ అభివృద్ధి చేస్తానంటే ఆయనకేం బాధ అంటూ చురకలు అంటించారు. పేదలకు ఇళ్లు పంపిణీ చేయవద్దని కోర్టుకు వెళ్లారని.. కేవలం చంద్రబాబు సామాజిక వర్గం వారే ఇళ్లు కట్టుకోవాలని భావిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతి ప్రజారాజధాని కాదని.. కేవలం కుల రాజధాని అంటూ ఆరోపించారు. తన కులం కోసం మాత్రమే చంద్రబాబు రాజధానిగా అమరావతిని ప్రకటించారన్నారు. అయితే ఉత్తరాంధ్ర ప్రజలు గాజులు వేసుకుని కూర్చోవాలా అని నిలదీశారు. ఉత్తరాంధ్ర అంటే ఉద్యమాల గడ్డ అని.. చంద్రబాబు తమాషాలు చూస్తూ ఊరుకునేది లేదన్నారు. ప్రజల్లో వైషమ్యాలు సృష్టించడం తప్పు అని హెచ్చరించారు.