కౌలు రైతుల విషయంలో వైసీపీ సర్కారుపై విమర్శలు చేసిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై మంత్రి అంబటి రాంబాబు సెటైర్లు వేశారు. పవన్ కళ్యాణ్ రైతుల గురించి మాట్లాడటం విచిత్రంగా ఉందని ఎద్దేవా చేశారు. కౌలు రైతులకు ఈ ప్రభుత్వం చేసిన ప్రయోజనం ఇంతవరకు ఏ ప్రభుత్వమూ చేయలేదని మంత్రి అంబటి రాంబాబు వివరించారు. కానీ ఇవేవీ పవన్ కళ్యాణ్‌కు కనిపించకపోవడం మన దౌర్భాగ్యం అన్నారు. చంద్రబాబు కోసమే ఉద్భవించిన రాజకీయ పార్టీ జనసేన అని.. పవన్ కళ్యాణ్‌ను పావుగా వాడుకునే కాపు సామాజిక వర్గం చంద్రబాబుకు వ్యతిరేకంగా ఉందని అంబటి రాంబాబు విమర్శలు చేశారు. కాపు సామాజిక వర్గాన్ని వాడుకోవడానికి పవన్ కళ్యాణ్‌ను చంద్రబాబు ఎరగా వేస్తున్నారని ఆరోపించారు.
ముఖ్యమంత్రి కావాలని నాకు లేదు అన్న పవన్ కళ్యాణ్ మాటలు వాస్తవమే అని.. ఎందుకంటే చంద్రబాబును గద్దెను ఎక్కించటమే పవన్ కళ్యాణ్ లక్ష్యమని మంత్రి అంబటి రాంబాబు వ్యాఖ్యానించారు. సెటైర్లు వేసే హక్కు దత్తపుత్రుడికే ఉంటుందా.. మాకు ఉండదా అని నిలదీశారు. పవన్ కళ్యాణ్‌కు స్క్రీన్ ప్లే రాయటం మాత్రమే వచ్చు అని.. తమకు సినిమా తీయటం కూడా వచ్చన్నారు. చంద్రబాబు గారి దత్తపుత్రుడు అనే టైటిల్‌తో సినిమా తీస్తామని అంబటి రాంబాబు ఎద్దేవా చేశారు. అయితే ఈ సినిమాకు ఐదారుగురు హీరోయిన్లు కావాలని నిర్మాతలు ముందుకు రావటం లేదని కామెంట్ చేశారు. ధైర్యం, దమ్ము ఉన్న నాయకుడు జగన్ అని.. ఆయన్ను గద్దె దించటం పవన్ కళ్యాణ్ వల్ల కాదని.. ఆయనకు ప్యాకేజీలు ఇస్తున్న చంద్రబాబు వల్ల కూడా కాదని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్, టీడీపీ కలిసి కక్షకట్టి కేసులు పెట్టినా మొక్కవోని ధైర్యంతో నిలబడి పోరాడిన నాయకుడు జగన్ అని వివరించారు. అరెస్టుకు, కన్వెన్షన్‌కు తేడా తెలియని వ్యక్తి పవన్ కళ్యాణ్ అని అంబటి రాంబాబు విమర్శించారు.
Kakani Govardhan Reddy: పవన్ కళ్యాణ్‌కు వ్యవసాయం గురించి ఏం తెలుసు?