విజయవాడలో దారుణం చోటుచేసుకుంది. లయోలా కళాశాలలో డిగ్రీ ఫైనలియర్ చదువుతున్న చైతన్య అనే విద్యార్థి తనకు దాహం వేయడంతో ఎనికేపాడులో ఓ దుకాణం వద్ద వాటర్ బాటిల్ అడిగాడు. అయితే వ్యాపారి నిర్లక్ష్యంగా వ్యవహరించాడు. వాటర్ బాటిల్ బదులు యాసిడ్ బాటిల్ ఇచ్చాడు. అప్పటికే దాహం వేస్తుండటంతో చైతన్య చూసుకోకుండా వాటర్ అనుకుని యాసిడ్‌ను గడగడా తాగేశాడు.
చైతన్య శరీరంలోకి యాసిడ్ వెళ్లడంతో వెంటనే అతడు మంటతో అల్లాడిపోయాడు. వెంటనే స్నేహితులు అతడిని సమీపంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. నాలుగురోజులుగా చైతన్య ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. యాసిడ్ అతడి శరీర అవయవాలపై తీవ్ర ప్రభావం చూపినట్లు తెలుస్తోంది. చైతన్య వైద్యానికి కళాశాల విద్యార్థులు విరాళాలను సేకరిస్తున్నారు. ఈ ఘటనపై ఫిర్యాదు అందడంతో పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.