కాకినాడ జిల్లాలో ఆదివారం మధ్యాహ్నం దారుణహత్య చోటుచేసుకుంది. సామర్లకోటలో నడిరోడ్డుపై యువకుడి హత్య కలకలం రేపింది. తలాటం శివ అనే యువకుడిని మణి అనే వ్యక్తి దారుణంగా హత్య చేశాడు. వివరాల్లోకి వెళ్తే.. పుట్టినరోజు సందర్భంగా శివ అనే వ్యక్తి సామర్లకోటలోని స్థానిక విఘ్నేశ్వర థియేటర్‌లో సినిమా చూసేందుకు వచ్చాడు. అయితే అతడిని థియేటర్ వద్దే మణి అనే వ్యక్తి కత్తితో పొడిచి హత్య చేశాడు. దీంతో పుట్టినరోజు నాడే శివ చనిపోయాడు. ఈ ఘటనపై స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వాళ్లు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు.
శివ అనే యువకుడు సామర్లకోటలోని అమ్మమ్మ కాలనీలో నివాసం ఉంటున్నాడు. అతడిని హత్య చేసేందుకు ముందుగానే ప్లాన్ వేసుకున్న మణి ఆదివారం నాడు అతడ్ని ఫాలో అయ్యాడు. షర్టులో వేట కత్తిని పెట్టుకుని మరీ థియేటర్ వద్దకు వెళ్లాడు. అతడితో పాటు మరికొందరు యువకులు ఒక్కసారిగా శివపై రాడ్లు, వేట కత్తితో దాడి చేశారు. మణి, అతడి స్నేహితులు జరిపిన దాడిలో శివ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. దీంతో శివ ఘటనా స్థలంలోనే ప్రాణాలు వదిలినట్లు స్థానికులు పోలీసులకు వివరించారు. అనంతరం నిందితుడు మణి స్వయంగా పోలీసులకు లొంగిపోయాడు. కాగా శివ హత్యకు వివాహేతర సంబంధమే కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు.
Repalle Case: రైల్వేస్టేషన్‌లో గ్యాంగ్ రేప్.. బాపట్ల జిల్లా ఎస్పీ ఏమన్నారంటే..?