నీతి ఆయోగ్ ముందు ఏపీ ప్రభుత్వం సమస్యల చిట్టా పెట్టింది. రాష్ట్ర విద్యుత్ రంగం ఎదుర్కొంటున్న ఇబ్బందులను నీతి ఆయోగ్ దృష్టికి ఏపీ అధికారులు తీసుకెళ్లారు. తీవ్ర రుణభారంతో ఉన్న విద్యుత్ ఉత్పత్తి, పంపిణీ సంస్థలను గాడిలో పెట్టడానికి తగిన సహాయ సహకారాలు అందించాలని సీఎం జగన్ కోరారు. రాష్ట్ర విభజన అనంతర పర్యవసనాల కారణంగా ఆర్థికంగా ఎదుర్కొంటున్న ఇబ్బందులను, హైదరాబాద్‌ను కోల్పోవడంతో పెద్ద ఎత్తున ఆదాయానికి గండి పడిందని గణాంకాలతో సహా నీతి ఆయోగ్ దృష్టికి అధికారులు తీసుకెళ్లారు.
ప్రఖ్యాత ప్రభుత్వ రంగ సంస్థలను కోల్పోయామని, సహజ వనరుల విషయంలోనూ ఇబ్బంది వచ్చిందని, ప్రత్యేక హోదా లాంటి హామీలు నెరవేరలేదని అధికారులు తెలిపారు. తెలంగాణతో పోలిస్తే.. ప్రస్తుతం ఏపీ తలసరి ఆదాయం చాలా తక్కువగా ఉందంటూ ఆ వివరాలను గణాంకాలతో చూపిన అధికారులు.. ప్రత్యేక హోదా ఇప్పించేలా తగిన సహకారం అందించాలని, పారిశ్రామిక రాయితీలు, పన్ను మినహాయింపులు ఇవ్వాలని కోరారు. కోరాపుట్, బాలంగీర్, బుందేల్‌ఖండ్ తరహాలో వెనకబడ్డ జిల్లాలను ఆదుకోవాలని, విభజన చట్టంలో ఇచ్చిన హామీలు ప్రకారం కడప స్టీల్‌ప్లాంట్ సహా ఇతర మౌలిక సదుపాయాల ఏర్పాటుకు తగిన సహాయం అందించాలని విన్నవించారు.
అంతేకాకుండా కడప స్టీల్ ప్లాంట్ కోసం అనంతపురంలో నాలుగు ఇనుప ఖనిజం గనులను కేటాయించాలని, జీఎస్టీ రీయింబర్స్ సహా మరికొన్ని ప్రోత్సాహకాలు ఇవ్వాలని, రాష్ట్రంలో నిర్మించనున్న పోర్టులకు ఆర్థిక సహాయం అందించాలని, పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తయ్యేలా అంచనాల ఆమోదానికి తగిన విధంగా తోడ్పడాలన్నారు. రాయలసీమ కరువు నివారణ ప్రాజెక్టుకు తగిన విధంగా నిధులు అందించాలని, అప్పర్ సీలేరులో కొత్తగా నిర్మించ తలపెట్టిన 1350 మెగావాట్ల విద్యుత్ ప్రాజెక్టుకు సహాయం అందించాలని, వీటితోపాటు తెలంగాణ నుంచి రావాల్సిన రూ.6,284 కోట్ల విద్యుత్ బకాయిలు ఇప్పించాలన్నారు. రీసోర్స్ గ్యాప్ కింద కాగ్ నిర్ధారించిన విధంగా ఇంకా రావాల్సిన రూ.18,969 కోట్ల నిధులు వచ్చేలా చర్యలు తీసుకోవాలని, జాతీయ ఆహార భద్రతా చట్టం కింద లబ్ధిదారుల ఎంపికలో హేతుబద్ధత లేని అంశాలను వివరించారు. దీని వల్ల రాష్ట్రానికి చాలా నష్టం కలుగుతోందని అధికారులు నీతి ఆయోగ్‌కు వెల్లడించారు.