వైసీపీలో నెమ్మదిగా లుకలుకలు బయటపడుతున్నాయి. సొంత పార్టీ నేతలే కుట్రలు చేస్తున్నారని సోమవారం మాజీ మంత్రి బాలినేని ఆరోపించగా.. ఈరోజు వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి కూడా సేమ్ డైలాగ్స్ చెప్పారు. తాను కూడా బాలినేని తరహాలో సొంత పార్టీ నేతల బాధితుడినేనని కోటంరెడ్డి స్పష్టం చేశారు. సొంత పార్టీ నేతలతో తాను కూడా ఇబ్బంది పడుతున్నానని.. కొందరు ఎమ్మెల్యేలు తన నియోజకవర్గంలో వేలుపెడుతున్నారని.. తన విషయంలో కూడా ఇలా జరగడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. తాను కూడా ఇతరుల నియోజకవర్గంలో జోక్యం చేసుకోవచ్చని.. కానీ ఎప్పుడు ఏ పార్టీలో ఉంటారో తెలియని కొందరు నేతలు జోక్యం చేసుకుని తనను బలహీనపర్చాలని చూస్తున్నారని కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి ఆరోపించారు. అయినా తానేమీ భయపడనని.. అలాంటి వాళ్లను ధైర్యంగా ఎదుర్కొని ముందుకు వెళ్తానని స్పష్టం చేశారు. అన్నీ సహిస్తానని.. తాను కూడా అన్నీ చేయగలనని.. కానీ చేయనని తెలిపారు. ఈ వ్యవహారాన్ని సీనియర్ నేతల దృష్టికి తీసుకువెళ్తానని పేర్కొన్నారు.
అబ్దుల్ అజీజ్‌ను తాను రాజకీయ సహచరుడిగానే, పాత స్నేహితుడిగానే చూస్తానని.. శత్రువులా మాత్రం చూడనని కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి స్పష్టం చేశారు. ఏ పార్టీ వారినైనా ఇలానే చూస్తానని కామెంట్ చేశారు. తనకు ప్రజల అండ, సీఎం జగన్ ఆశీస్సులు ఉన్నంత వరకు తనను ఎవరూ ఏమీ చేయలేరని కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి అన్నారు. ఇలాంటి వ్యవహారాలను ఎలా ఎదుర్కోవాలో, ఎలా డీల్ చేయాలో తనకు బాగా తెలుసన్నారు. నా నియోజకవర్గంలో వేలుపెట్టేవాళ్లు ముందు వాళ్ల సంగతి చూసుకోవాలని.. వాళ్ల నియోజకవర్గం సంగతి పట్టించుకోవాలంటూ చురకలంటించారు. తనను ఇబ్బందిపెట్టే వాళ్ల పేర్లు మాత్రం తాను ఇప్పుడు బయటపెట్టనని, ఇప్పటికే అధిష్టానానికి చెప్పానని, సమయం వచ్చినప్పుడు పేర్లు బయటపెడతానని పేర్కొన్నారు. మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్‌తో తనకు సత్సంబంధాలున్నాయని కోటంరెడ్డి తెలిపారు.