ఏపీ ప్రభుత్వం అనూహ్య నిర్ణయం తీసుకుంది. కోనసీమ జిల్లా పేరును డా.బీఆర్ అంబేద్కర్ కోనసీమగా మారుస్తున్నట్లు ప్రభుత్వం ప్రటించింది. ఈ మేరకు ప్రిలిమినరీ ఉత్తర్వులు త్వరలోనే జారీ కానున్నాయి. రెండు నెలల కిందట జిల్లాల విభజన సందర్భంగా అమలాపురం కేంద్రంగా కోనసీమ జిల్లా ఏర్పాటైంది. అయితే ఈ జిల్లాకు బీఆర్ అంబేద్కర్ పేరు పెట్టాలని దళిత, ప్రజాసంఘాలు, వివిధ పార్టీలు కోరుతున్నాయి. ఈ అంశంపై పలుచోట్ల నిరసన, ఆందోళన కార్యక్రమాలు కూడా చోటుచేసుకున్నాయి.
దీంతో కోనసీమ జిల్లా పేరు మార్చాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే అల్లూరి సీతారామరాజు, ఎన్టీఆర్, వైఎస్ఆర్ వంటి మహనీయుల పేర్లను పలు జిల్లాలకు పెట్టడంతో అంబేద్కర్ పేరు కూడా పెట్టాలని డిమాండ్లు రావడంతో జగన్ ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. అయితే కోనసీమ జిల్లా పేరు మార్పుపై అధికారికంగా ఉత్తర్వులు జారీ కావాల్సి ఉంది.