Kodali Nani: ఏపీలో పల్నాడు జిల్లా మాచర్ల రాజకీయాలు కాక రేపుతున్నాయి. మాచర్లలో వైసీపీ, టీడీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. వైసీపీ వాళ్లే దాడి చేశారంటూ టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో మాచర్ల ఘటనపై మాజీ మంత్రి కొడాలి నాని స్పందించారు. రాజకీయాల్లో గొడవలు సర్వసాధారణమని వ్యాఖ్యానించారు. ఇలాంటి గొడవలు మొదటిసారి కాదు.. చివరిసారి కూడా కాదన్నారు. బహిరంగ సభల్లో 75 ఏళ్ల చంద్రబాబు ప్రతిరోజూ వైసీపీ నేతలను బట్టలూడదీసి కొడతానని అంటున్నారని.. బహుశా ఆయన మాట్లాడిన మాటలను మాచర్లలో టీడీపీ నేతలు ఆదర్శంగా తీసుకుని ఉంటారని కొడాలి నాని అనుమానం వ్యక్తం చేశారు.
Read Also: 100 టెస్టులు ఆడిన టీమిండియా ఆటగాళ్లు వీళ్లే..!!
మరోవైపు కొడాలి నాని ప్రాతినిధ్యం వహిస్తున్న గుడివాడ క్యాసినో వ్యవహారం మరోసారి తెర మీదకు వచ్చింది. గత ఏడాది సంక్రాంతి సమయంలో గుడివాడలో కొడాలి నాని క్యాసినో నిర్వహించారంటూ టీడీపీ పెద్ద ఎత్తున ప్రచారం చేసింది. ఇదే వ్యవహారంపై కేంద్రం నుంచి విచారణ సంస్థల వరకు ఫిర్యాదులు చేసింది. ప్రస్తుతం టీడీపీ ఫిర్యాదులపై ఆదాయపు పన్ను శాఖ స్పందించింది. ఈ అంశంపై పూర్తి సమాచారం కావాలని నోటీసులు జారీ చేసింది. టీడీపీ నుంచి చేసిన ఫిర్యాదు మేరకు పార్టీ పోలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్యకు ఆదాయపు పన్ను శాఖ అధికారులు నోటీసులు ఇచ్చారు. ఫిర్యాదులో పేర్కొన్న విధంగా క్యాసినోకు సంబంధించి పూర్తి వివరాలతో తమ ముందుకు రావాలని నోటీసులో పేర్కొన్నారు. ఈ నెల 19న విచారణకు రావాలని నోటీసులో పేర్కొన్నారు.