ఖరీఫ్‌లో ధాన్యం కొనుగోళ్లకు సంబంధించిన గైడ్ లైన్స్ విడుదల చేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం… ఈ ఏడాది ఖరీఫ్ సీజన్‌లో సుమారు 50 లక్షల మెట్రిక్ టన్నుల కొనుగోళ్లు చేపట్టేలా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది ఏపీ సర్కార్.. గ్రేడ్-ఏ రకం ధాన్యం క్వింటాల్‌కు రూ.1960గా కనీస మద్దతు ధర నిర్ణయించగా… కాన్ రకం ధాన్యానికి క్వింటాల్‌కు రూ. 1940గా కనీస మద్దతు ధర నిర్ణయించింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఈనెల రెండవ వారం నుంచి రాష్ట్రంలోని 8774 రైతు భరోసా కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోలు ప్రక్రియను ప్రారంభించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటివరకు సుమారు 40 లక్షల వరి సాగు వివరాలు ఈ-క్రాప్ లో నమోదు కాగా క్షేత్రస్థాయి అధికారులు 37 లక్షల ఎకరాలను పరిశీలించి సర్టిఫై చేసినట్టుగా తెలుస్తోంది.. ఖరీఫ్ లో 21,71,708 మంది రైతులు వరిని సాగు చేయగా 15,37,269 మంది ఇప్పటివరకు ఈ-క్రాప్ లో వివరాలు నమోదు చేశారు. ఈ-క్రాప్ లో ఎలాంటి పొరపాట్లకు అవకాశం లేకుండా నమోదు ప్రక్రియనంతటినీ యూనిఫైడ్ డిజిటల్ ప్లాట్ ఫాం రైతు భరోసా (యూడీపీఆర్బీ) యాప్ సాయంతో ప్రభుత్వం ఆధునీకరి స్తోంది. ఈ-క్రాప్ పూర్తయిన రైతులకు డిజిటల్ రసీదును కూడా అందచేస్తున్నారు. యూడీపీఆర్‌బీ యాప్‌లో పొందుపర్చిన అన్ని వివరాలను ధాన్యం కొనుగోలు చేసే రాష్ట్ర పౌరసరఫరాల శాఖకు అనుసంధానం చేయనున్నారు.