వైసీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ యాదవులపై ఎదో మాట్లాడారని కూటమి నాయకులు రాద్ధాంతం చేస్తున్నారని మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు మండిపడ్డారు. అసలు జగన్ ఏం మాట్లాడారు అనేది యాదవ సోదరులతో పాటు అందరూ తెలుసుకోవాలన్నారు. యాదవులకు జగన్ అధిక ప్రాధాన్యత ఇచ్చారని, ద్రోహం చేసింది టీడీపీనే అని పేర్కొన్నారు. టీడీఆర్ బాండ్ల కుంభకోణంలో లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని, యాదవులపై కూటమి ప్రభుత్వం డైవర్షన పాలిటిక్స్ చేస్తోందన్నారు. టీడీఆర్ బాండ్ల వ్యవహారం నడిపింది మొత్తం చంద్రబాబు సామాజిక వర్గం వాళ్లే అని కారుమూరి అన్నారు.
Also Read: Virat Kohli-Vizag: విశాఖ అంటేనే ఊపొస్తుందా?.. విరాట్ కోహ్లీ గణాంకాలు చూస్తే పిచ్చెక్కడం పక్కా!
తణుకులో మీడియా సమావేశంలో కారుమూరి వెంకట నాగేశ్వరరావు మాట్లాడుతూ… ‘మాజీ సీఎం జగన్ యాదవులపై ఎదో మాట్లాడారని కూటమి నాయకులు రాద్ధాంతం చేస్తున్నారు. అసలు జగన్ ఏం మాట్లాడారు అనేది యాదవ సోదరులతో పాటు అందరూ తెలుసుకోవాలి. జగన్ మాట్లాడిన విషయంలో గోపీనాథ్ జెట్టి, కృష్ణయ్య గురించి ఎక్కడా అవమానించలేదు. జగన్ రెడ్డిని చంపేస్తే ఎవరు అడుగుతారు అంటూ కూటమి నేతలు మాట్లాడుతున్నారు. చంద్రబాబు నాయుడు డైవర్ట్ పాలిటిక్స్ చేస్తున్నారు. తిరుమలలో శ్రీవారి తలుపులు యాదవులు తెరిచే ఆచారంను వంశపారంపర్యంగా వస్తుంటే దానిని చంద్రబాబు తీసేయాలని చూశారు. పార్టీలో కీలక నేత యనమలకు చోటు ఎక్కడ ఉంది. ఎమ్మెల్సీ, ఎంపీ పదవులు ఇచ్చిన ఘనతగా జగన్ గారికి దక్కుతుంది. ఇదే చంద్రబాబు నాయి బ్రాహ్మణుల తోక కత్తిరిస్తా, ఎస్సీలుగా పుట్టాలని ఎవరైన కోరుకుంటారా అంటూ మాట్లాడారు. యాదవ సామాజిక వర్గానికి చెందిన కారుమూరిపై కక్ష సాధించాలని టీడీఆర్ బాండ్ల 800 స్కాం జరిగిందని అసత్య ప్రచారం చేశారు. అంతా కలిపితే 70 నుంచి 80 కోట్ల బాండ్ల జారీ మాత్రమే జరిగిందని వారి ప్రభుత్వమే చెబుతుంది. టీడీఆర్ బాండ్ల వ్యవహారం నడిపింది మొత్తం చంద్రబాబు సామాజిక వర్గం వాళ్లే. యాదవులకు జగన్ అత్యధిక ప్రాధాన్యత ఇచ్చారు, యాదవులకు ద్రోహం చేసింది టీడీపీనే’ అని అన్నారు.