Kanna Lakshminarayana: ఆంధ్రప్రదేశ్‌లో భారతీయ జనతా పార్టీకి షాక్ తప్పదనే వార్తలు హల్ చల్ చేస్తున్నాయి.. బీజేపీ సీనియర్ నేత, రాష్ట్ర బీజేపీ మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ బీజేపీకి రాజీనామా చేసే యోచనలో ఉన్నారు.. ఆయన జనసేన పార్టీలో చేరతారనే వార్తలు కూడా గతంలో ప్రచారంలో ఉన్న విషయం విదితమే కాగా.. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు కూడా దూరంగా ఉన్నారు కన్నా లక్ష్మీనారాయణ.. అయితే, గతకొంత కాలంగా కన్నా పార్టీ వీడతారని ప్రచారం జరుగుతోంది. ఆ మధ్య జనసేన నేత నాదెండ్ల మనోహర్ సైతం కన్నా లక్ష్మీ నారాయణతో ప్రత్యేకంగా సమావేశం అయ్యారు.. జనసేన పార్టీలోకి ఆహ్వానించినట్లు ప్రచారం సాగింది.. ఆ వ్యాఖ్యలకు ఆయన ఊతం ఇస్తూ.. బహిరంగంగానే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు, ఎంపీ జీవీఎల్ లాంటి నేతలపై ఘాటు వ్యాఖ్యలు చేస్తూ వచ్చారు..
Read Also: GVL Narasimha Rao: దేశ చరిత్రలో వంగవీటి రంగా చరిత్ర అరుదైన సంఘటన..
అయితే, ఇవాళ కన్నా లక్ష్మీనారాయణ తన నివాసంలో ముఖ్య అనుచరులతో, కార్యకర్తలతో సమావేశం అయ్యారు.. ఈ సమావేశంలో భవిష్యత్తు రాజకీయ నిర్ణయాలపై చర్చించి, ఓ నిర్ణయానికి రానున్నారట.. ఈ సమావేశంలోనే రాజీనామాపై ఓ నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది.. కన్నాతో పాటు పలువురు మండల, జిల్లా స్థాయి నాయకులు కూడా రాజీనామా చేసే అవకాశం ఉందంటున్నారు.. బీజేపీకి రాజీనామా చేయాలంటూ ముఖ్య నాయకులు సైతం కన్నా లక్ష్మీనారాయణపై ఒత్తిడి తెస్తున్నారట.. సమావేశం అనంతరం భవిష్యత్తు రాజకీయ నిర్ణయాలపై క్లారిటీ వచ్చే అవకాశం ఉందంటున్నారు.. అయితే, సీనియర్ నేత అయిన కన్నాకు ఎలాంటి కార్యక్రమాలు అప్పగించకుండా పక్కన బెట్టడం ఏంటి? సరైన గౌరవం ఇవ్వడం లేదని ఆయన అనుచరులు మండిపడుతున్నారు.