Maoist Hidma Security Team Arrest: అల్లూరి సీతారామ రాజు జిల్లా మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో మంగళవారం ఉదయం జరిగిన ఎన్‌కౌంటర్ మావోయిస్టు కీలక నేత హిడ్మా ప్రాణాలు విడిచారు.. అయితే, హిడ్మాతో పాటు ఆయన భార్య హేమ.. మరో నలుగురు మావోయిస్టులు కూడా మృతిచెందారు.. అయితే, ఈ ఎన్‌కౌంటర్ నుంచి హిడ్మా సెక్యూరిటీగా ఉన్న ఇద్దరు మావోయిస్టులు తప్పించుకున్నట్టుగా తెలుస్తోంది.. కాకినాడ జిల్లా సామర్లకోట మండలం, కొప్పవర ప్రాంతంలో పోలీసులు ఇద్దరు మహిళా మావోయిస్టులను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఇద్దరు మహిళలు PLGA టాప్ లీడర్ హిడ్మాకు సెక్యూరిటీగా పనిచేస్తుండగా, హిడ్మా ఎన్‌కౌంటర్ అనంతరం కాకినాడ వైపు వెళ్తుండగా పోలీసులు వారిని పట్టుకున్నారు.
పోలీసులు ఇద్దరు మహిళా మావోయిస్టులను అంకిత మరియు అనూషగా గుర్తించారు. ఈ ఇద్దరు మహిళా మావోయిస్టులను విజయవాడకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు స్థానిక పోలీసులు వెల్లడించారు. ఈ ఇద్దరు మావోయిస్టులు ఏజెన్సీ ప్రాంతం నుంచి శంకవరం, రౌతులపూడి మార్గం ద్వారా కాకినాడ వెళ్లేందుకు ప్రయత్నిస్తుండగా.. పోలీసులకు చిక్కారు.. పోలీసులు వివరించిన వివరాల ప్రకారం, హిడ్మా పై జరిగిన ఆపరేషన్ల తర్వాత మావోయిస్టుల షెల్టర్ జోన్లపై కొనసాగుతున్న దాడులలో భాగంగా ఈ మహిళలను అదుపులోకి తీసుకోవడం జరిగింది. వారిని విచారించి మరిన్ని ముఖ్య సమాచారం పొందేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
కాగా, హిడ్మా ఎన్‌కౌంటర్ తర్వాత ఆంధ్రప్రదేశ్ వ్యాప్తం పలు జిల్లాలో ఆపరేషన్ నిర్వహించిన పోలీసులు.. ఏకంగా 50 మంది మావోయిస్టులను అరెస్ట్ చేసిన విషయం విదితమే. మరోవైపు.. అల్లూరి జిల్లాలో నిన్నటి నుంచి మావోయిస్టుల కోసం పోలీసుల వేట కొనసాగుతుంగా.. ఈ రోజు ఎన్‌కౌంటర్‌లో మరో ఏడుగురు మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయిన విషయం విదితమే.