కష్టాల్లో ఉన్నప్పుడు జనసేన గుర్తొస్తోంది. రేపు ఓటేసేటప్పుడు కూడా జనానికి జనసేనే గుర్తుకు రావాలి అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. వైసీపీని మేం శత్రువుగా చూడడం లేదు.. కానీ ఆ ప్రభుత్వ విధానాలు సరిగా లేకుంటే మేం విమర్శలు చేస్తున్నాం. స్టీల్ ప్లాంట్ గురించి అడిగితే పచ్చి బూతులు తిడతారు.. ఇంట్లో వాళ్లని తిడతారు. స్టీల్ ప్లాంట్ అంటే ఏదో చిన్న పరిశ్రమ కాదు.. ఆత్మగౌరవం. నేను బీజేపీతో చిటికి మాటికి గొడవలు పెట్టుకోవాలని నన్ను అడుగుతారు.. వైసీపీ నేతలు మాత్రం గొడవ పెట్టుకోరు అన్నారు.
ఇక ఏపీ రాజధాని అమరావతే అనే విషయాన్ని అంగీకరించాలని బీజేపీ అగ్ర నాయకత్వాన్ని కోరాను. అమరావతిని ఒప్పుకోకుంటే ఇబ్బంది ఉంటుందని చెప్పాను. నేను ముందు నుంచి చెబుతున్నట్టే బీజేపీ అదే మాట ఉంది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఓ మాట.. అధికారంలోకి వచ్చాక మరో మాట. స్టీల్ ప్లాంటును ప్రైవేటీకరణ చేయొద్దని కేంద్రాన్ని అడగాలని నన్ను డిమాండ్ చేస్తున్నారు.. మరి ఇంత మంది ఎంపీలున్న వైసీపీ పార్లమెంటులో ఏం చేస్తోంది. ఎన్నికల సమయంలో విడివిడిగా పోటీ చేయొచ్చు.. కానీ సమస్య వచ్చినప్పుడు అందరూ కలిసి వెళ్లాలి.. నేను అదే కోరుకుంటున్నా. అందుకే అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లాలని కోరాను అని తెలిపారు.
అయితే నా సభలకు లక్షలాది మంది జనం వస్తారు.. కానీ చట్టసభల్లో నాకు బలం లేదు అని పవన్ చెప్పారు. చట్టసభల్లో నాకే బలం ఉంటే వైసీపీ తరహాలో చేతకాని తనంగా వ్యవహరించను. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ పార్లమెంటులో ప్లకార్డులు పట్టుకునే ధైర్యం వైసీపీకి ఉందా అని ప్రశ్నించారు. వైసీపీ చేసే దాడులతో తెలుగుదేశం పార్టీ నిస్సహయ స్థితిలోకి వెళ్లిందంటే పరిస్థితి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోండి. భవిష్యత్తులో జనసేనకు బలం వస్తే ఎంపీ, ఎమ్మెల్యేలు ఎలా ఉండాలో చూపిస్తాం అని పేర్కొన్నారు.