ప్రజల సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తెచ్చేందుకు జనసేన పార్టీ వినూత్న కార్యక్రమం చేపట్టింది. దీనికి జనవాణి అని పేరు పెట్టిన సంగతి తెలిసిందే. ఇవాళ రెండోవిడత జనసేన జనవాణి భరోసా కార్యక్రమం జరగనుంది.సమస్యలపై ప్రజల నుంచి నేరుగా అర్జీలు స్వీకరించనున్నారు జనసేన అధినత పవన్ కళ్యాణ్. గత ఆదివారం 427 అర్జీలు అందించారు ప్రజలు. ఆయా సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళతామని ప్రకటించారు పవన్ కళ్యాణ్. ఎప్పటికప్పుడు ఫాలో అప్ చేసేలా టీంను ఏర్పాటు చేశారు పవన్ కళ్యాణ్. మొదటిసారి నిర్వహించిన కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన లభించిందని జనసేన నేత నాదెండ్ల మనోహర్ తెలిపారు. కృష్ణా, గుంటూరు, ప్రకాశం, విజయవాడ, ఒంగోలు నుంచి ప్రజలు ఈ కార్యక్రమానికి తరలివస్తారని నాదెండ్ల అంటున్నారు. నేతలు అధికారంలో ఉంటేనే సమస్యలు పరిష్కారం చేస్తామంటే కుదరదని పవన్ ఇంతకుముందే ప్రకటించారు. తమకు పదవి లేకపోయినా సమాజంలో ఇబ్బందులపై దృష్టి సారించి పరిష్కరిస్తామని పవన్ పేర్కొన్నారు.ఈ కార్యక్రమం విజయవాడలోని మాకినేని బసవపున్నయ్య ఆడిటోరియంలో వుంటుంది.
ఇవాళ మరోసారి అర్జీలు తీసుకుని అధికారులకు పంపనున్నారు పవన్ కళ్యాణ్. ఇవాళ ఉదయం 11 గంటల నుంచి మూడు గంటల వరకు జనవాణి కార్యక్రమం వుంటుందని జనసేన కార్యాలయం వెల్లడించింది. ఈరోజు కూడా జనవాణి కార్యక్రమంలో ప్రజల సమస్యలను నేరుగా అడిగి తెలుసుకుంటారు పవన్. వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లనున్నారు. పవన్ కళ్యాణ్ ఇవాళ ఏకాదశి సందర్భంగా గుంటూరు జిల్లాలోని నంబూరు దశావతార వెంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. ఏకాదశి సందర్భంగా ఈ ఆలయంలో పవన్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. పవన్ కు ఆలయ పూజారులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికి వేదాశీర్వచనం అందచేశారు.
Janasena Party: జనవాణి కార్యక్రమానికి భారీ స్పందన.. అర్జీలు స్వీకరించిన పవన్