Pawan Kalyan: ఏపీలో వికేంద్రీకరణ ఉద్యమం ఊపందుకుంటున్న వేళ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉత్తరాంధ్రలో పర్యటించబోతున్నారు. ఈనెల 15 నుంచి మూడు రోజుల పాటు పవన్ ఉత్తరాంధ్ర జిల్లాలలో పలు పార్టీ కార్యక్రమాలలో పాల్గొంటారని సోమవారం సాయంత్రం జనసేన పార్టీ ప్రకటించింది. ఈ పర్యటనలో ఉత్తరాంధ్రకు చెందిన జనసేన పార్టీ నేతలు, పార్టీ వాలంటీర్లతో పవన్ సమావేశం కానున్నట్లు తెలిపింది. ఈనెల 16న విశాఖలో ఉత్తరాంధ్ర జిల్లాలకు సంబంధించిన జనవాణి కార్యక్రమాన్ని పవన్ కళ్యాణ్ నిర్వహిస్తారని వెల్లడించింది. ఈ కార్యక్రమంలో భాగంగా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ ఉమ్మడి జిల్లాలకు చెందిన ప్రజల నుంచి వాళ్ల సమస్యలకు సంబంధించి వినతి పత్రాలను పవన్ కళ్యాణ్ స్వీకరించనున్నారు.
Read Also: ఈ ఏడాది అన్ని ఫార్మాట్లలో కలిపి ఎక్కువ పరుగులు చేసిన ఆటగాళ్లు
అటు ఈనెల 15, 16, 17 తేదీల్లో విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల నేతలతో పవన్ కళ్యాణ్ సమావేశం అవుతారని జనసేన పార్టీ ప్రకటించింది. ఈ సమావేశాల్లో పార్టీ నాయకులకు, శ్రేణులకు రానున్న ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై పవన్ దిశానిర్దేశం చేయనున్నారని తెలిపింది. మరోవైపు వికేంద్రీకరణకు మద్దతుగా ఈనెల 15న విశాఖ గర్జన నిర్వహిస్తామని అధికార పార్టీ వైసీపీ ప్రకటించగా.. దేనికి గర్జన అంటూ పవన్ ప్రశ్నించిన సంగతి తెలిసిందే. విశాఖలోని రుషికొండను అడ్డగోలుగా ధ్వంసం చేసినందుకా.. లేదా దసపల్లా భూములను సన్నిహితులకు ధారాదత్తం చేసేలా ఆదేశాలు ఇచ్చినందుకా అని పవన్ నిలదీశారు.
15వ తేదీ నుంచి శ్రీ పవన్ కళ్యాణ్ గారు విశాఖ పర్యటన pic.twitter.com/QESbjukXYs
— JanaSena Party (@JanaSenaParty) October 10, 2022