Janasena:జనసేన పార్టీ సభ్య నమోదు గడువును పొడిగించింది.. మరో మూడు రోజుల పాటు జనసేన క్రియాశీలక సభ్యత్వ నమోదు గడువు పొడిగించినట్టు ప్రకటించారు జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహార్.. జనసేన పార్టీ మూడో విడత క్రియాశీలక సభ్యత్వ నమోదు ప్రక్రియ రెట్టించిన ఉత్సాహంతో ముందుకు సాగుతోందన్న ఆయన.. ఈ మహాక్రతువులో పాలు పంచుకుంటున్న వాలంటీర్లు, జన సైనికులు, వీర మహిళల స్ఫూర్తి నిరూపమానం అన్నారు.. గత కొద్ది రోజులుగా సాగుతున్న జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ నమోదు రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో అమిత వేగంతో సాగుతోందని.. అన్ని ప్రాంతాల నుంచి సభ్యత్వం తీసుకునేందుకు ప్రజలు ముందుకు రావడం శుభ పరిణామంగా చెప్పుకొచ్చారు..
Read Also: Operation For Cobra: నాగుపాముకు శస్త్ర చికిత్స.. తలపై కుట్లు వేసిన వైద్యుడు
అయితే, సభ్యత్వ నమోదు సమయంలో కొన్ని సాంకేతిక అంశాలు ఇబ్బంది పెట్టినట్లు, సభ్యత్వం గడువు మరి కొంత పెంచాలని జన సైనికులు, వాలంటీర్లు, వీర మహిళల నుంచి పెద్ద ఎత్తున అభ్యర్థనలు జనసేన పార్టీ కార్యాలయానికి అందాయి.. దీంతో సభ్యత్వ నమోదు గడువును మరో మూడు రోజులు పాటు పెంచుతూ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహార్. కాగా, జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ నమోదు.. ఫిబ్రవరి 10వ తేదీన ప్రారంభమైంది.. ఫిబ్రవరి 28వ తేదీతో ఈ కార్యక్రమం ముగియాల్సి ఉండగా.. క్షేత్రస్థాయి నుంచి వచ్చిన విజ్ఞప్తులతో.. మరో మూడు రోజుల పాటు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది పార్టీ అధిష్టానం..