Sabari Express: గుంటూరు రైల్వేస్టేషన్ సమీపంలో రైల్వే ట్రాక్‌పై అడ్డంగా ఓ ఇనుప రాడ్డును ఉంచిన ఘటన ఇప్పుడు సంచలనం రేపుతోంది. కంకరగుంట గేటు సమీపంలో రైల్వే ట్రాక్‌పై అడ్డంగా కొందరు దుండగులు ఇనుప రాడ్డును బిగించారు. దీంతో సోమవారం సాయంత్రం సికింద్రాబాద్-త్రివేండ్రం శబరి ఎక్స్‌ప్రెస్ వెళ్లే సమయంలో స్థానికులు ఈ ఇనుప రాడ్డును గుర్తించారు. సాయంత్రం 5 గంటల సమయంలో నల్లపాడు-గుంటూరు సెక్షన్ మధ్య రైలు పట్టాలపై ఉంచిన ఇనుపరాడ్డును చూసిన లోకో పైలెట్ మంజునాథ్ వెంటనే అప్రమత్తమై రైలును నిలిపిచేయడంతో ప్రమాదం తప్పింది. లేదంటే ఆ రాడ్డు విరిగి ఇంజిన్ అడుగు భాగాన తగిలి మంటలు వ్యాపించే ప్రమాదం ఉందని నిపుణులు తెలుపుతున్నారు.
Read Also: Gas Prices: వినియోగదారులకు ఊరట.. తగ్గిన గ్యాస్ సిలిండర్ ధర
అయితే శబరి ఎక్స్‌ప్రెస్ రైలు పరిమిత వేగంతో వెళ్తున్నందున ప్రయాణికులకు అసౌకర్యం కలగకుండానే రైలును ఆపగలిగారు. ఇంజినీరింగ్ సిబ్బంది, సహాయ లోకో పైలెట్లు వెళ్లి ఆ రాడ్డును తొలగించిన అనంతరం రైలు గుంటూరు స్టేషన్‌కు చేరింది. దుండగులు పథకం ప్రకారమే రైలు పట్టాలపై ఇనుపరాడ్డును ఉంచినట్లు సిబ్బంది అభిప్రాయపడుతున్నారు. రాడ్డును గుడ్డతో కట్టడంతో పాటు సిగ్నలింగ్ వ్యవస్థకు ఎటువంటి ఇబ్బంది లేకుండా రాడ్డుపై ఆట్టముక్కలను దుండగులు అమర్చారు. ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న పోలీసులు ట్రాక్ పరిసర ప్రాంతాల్లో ఉన్న సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. ఇప్పటికే కేసు నమోదు చేసిన రైల్వే పోలీసులు విచారణ ప్రారంభించారు. కాగా రైలు పట్టాలపై సిబ్బంది గస్తీ నిర్వహిస్తూ ఇటువంటి వాటిని గుర్తిస్తుంటారు. వారు ఈ మార్గంలో తనిఖీ చేసుకుంటూ వెళ్లిన తర్వాత దీన్ని అమర్చి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు.