ఆంధ్రప్రదేశ్‌లో సినిమా టికెట్ల వ్యవహారం ఓ దశలో ప్రభుత్వం వర్సెస్ టాలీవుడ్‌గా మారింది.. అయితే, ఈ వ్యవహారం మరింత రచ్చగా మారకుండా సినీ పెద్దలు కొందరు రంగంలోకి దిగి ప్రభుత్వంలో చర్చలు జరపడం.. ప్రభుత్వం కమిటీ వేయడం.. ఆ కమిటీ వరుసగా సమావేశాలు అవుతూ.. వివిధ సమస్యలపై చర్చించడం జరుగుతోంది.. మరోవైపు.. ఏ విషయమైనా కుండ బద్దలు కొట్టినట్టుగానే మాట్లాడే వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ కూడా ఈ వ్యవహారంలో ఎంట్రీ ఇచ్చాడు.. కొన్ని సందర్భాల్లో మైక్ పట్టి తన అభిప్రాయాలు చెబుతూ.. ఏపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసిన ఆర్జీవీ.. ఇక, సోషల్ మీడియా వేదికగా కూడా రచ్చ చేశారు.. ఆర్జీవీ, మంత్రి పేర్నినాని మధ్య సినిమా టికెట్ల వ్యవహారంలో ట్వీట్ల యుద్ధమే జరిగింది.. చివరకు ఓసారి కలిసి మాట్లాడుకుందామనే నిర్ణయానికి వచ్చిన మంత్రి పేర్నినాని, ఆర్జీవీ.. నిన్న సమావేశమై సుదీర్ఘంగా మంతనాలు జరిపారు.. వారి భేటీలో ఆసక్తికరమైన చర్చ సాగింది..
Read Also: పెరుగుతోన్న కరోనా కేసులు.. ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు
మంత్రి పేర్ని నానితో వర్మ సుదీర్ఘ భేటీలో అనేక అంశాలను ప్రస్తావించారు.. సినిమా టిక్కెట్ల ధరలు.. ప్రభుత్వ పెత్తనం సహా వివిధ అంశాలపై పేర్ని-వర్మ మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది.. సినిమా సమస్యలే కాకుండా.. ఇతర అంశాల పైనా మంత్రి-దర్శకుల భేటీలో చర్చ సాగింది.. టిక్కెట్ ధరలు నిర్ణయించే అధికారం ప్రభుత్వానికి ఎక్కడదని నేరుగా మంత్రిని ప్రశ్నించారు ఆర్జీవీ.. అయితే, గతం నుంచి వివిధ ప్రభుత్వాలు ఇచ్చిన జీవోలు.. చట్టాలను వర్మ ముందు పెట్టారు పేర్ని నాని.. తాము చట్టంలో ఉన్నదే చేస్తున్నాం తప్ప.. కొత్తగా చట్టాలు చేయలేదని ఆయన స్పష్టం చేస్తే.. అసలు ఇలా ఎలా ఉంటుందంటూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు ఆర్జీవీ.. ఇలాగే ఉంటాయని.. చాలా కాలం క్రితం కేంద్ర, రాష్ట్రాలు చట్టాలు చేశాయని మంత్రి వివరించారు.. మరి ముంబైలో ఓ టిక్కెట్ ధరను రూ. 2200 కూడా అమ్ముతున్నారని వర్మ వ్యాఖ్యానించగా.. ముంబైలో ఒక థియేటర్‌లోనే టిక్కెట్ ధర రూ. 2200 ఉంటుందని.. మిగతా అన్ని చోట్ల ఎలా ఉందో చూడాలి కదా? అంటూ కౌంటర్ ఇచ్చారు పేర్ని.. ఏపీలో కూడా మల్టీప్లెక్సుల్లో రూ. 250 ధర ఉన్న విషయాన్ని ప్రస్తావించకుండా.. పల్లెల్లో నాన్ ఏసీ థియేటర్‌కు ఫిక్స్ చేసిన రూ. 5 ధరనే ఎందుకు ప్రస్తావిస్తారని ఆర్జీవీని నిలదీశారు.. కూరగాయలు పండించుకునే రైతులు కూడా రైతు బజార్‌లోకి వస్తే ప్రభుత్వం నిర్దేశించిన ధరకే అమ్మాలని మంత్రి స్పష్టం చేశారు. అయితే, ఆర్ఆర్ఆర్, పుష్ప, రాథే శ్యామ్ వంటి భారీ బడ్జెట్ సినిమాలకు టిక్కెట్ ధరల తగ్గింపు వల్ల నష్టం చేకూరదా..? అని ఆర్జీవీ ప్రశ్నించగా.. పెట్టిన పెట్టుబడి అంతా వారం పది రోజుల్లోనే రాబట్టుకోవాలనే తాపత్రయం వల్ల జరిగే పరిణామాలని.. గతంలో ఇలా ఉండేది కాదు కదా అంటూ గతంలో సినిమాల ప్రదర్శన వంటి అంశాలను గుర్తు చేశారు మంత్రి.
మరోవైపు, సినిమా టిక్కెట్లను నియంత్రించినట్టు విద్యా, వైద్యం వంటి వాటి విషయాల్లో ఎందుకు నియంత్రించడం లేదని సూటిగా ప్రశ్నించారు ఆర్జీవీ.. అయితే, స్కూల్, కాలేజ్ ఫీజులను కూడా రెగ్యులేట్ చేస్తున్నామంటూ మంత్రి నాని వివరించగా.. నిజమా..? ఇది జరుగుతుందా..? అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు ఆర్జీవీ… ఈ సందర్భంగా స్కూల్, కాలేజ్ ఫీజుల కోసం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను డాక్యుమెంట్లతో సహా ఆర్జీవీ ముందు పెట్టారు.. ఇక, ఫీజు రీయింబర్స్‌మెంట్ విధానం గురించి కూడా ఆర్జీవీ ఆరా తీశారు.. ఫీజు రీ-యింబర్సుమెంట్ విధానం.. కాలేజీల్లో మేనేజ్మెంట్ కోటా వంటి విషయాలను ఆర్జీవీకి వివరించారు.. అయితే, హీరోల రెమ్యూనరేషన్‌ను కట్టడి చేయాలని ప్రభుత్వం ఎందుకు భావిస్తోందన్న వర్మ అసలు ప్రశ్న లేవనెత్తారు.. కానీ, హీరోల రెమ్యూనరేషన్ గురించి ప్రభుత్వం ఏమీ పట్టించుకోవడం లేదని.. అది తమకు సంబంధించిన అంశం కాదని స్పష్టం చేశారు మంత్రి పేర్ని నాని.. ఇదే సందర్భంలో మంత్రి అనిల్ కామెంట్లను ఆర్జీవీ గుర్తు చేయగా.. ప్రభుత్వ నిర్ణయాలను చూడాలి తప్ప.. వ్యక్తిగతంగా మేం చేసే కామెంట్లను పట్టించుకోవద్దని ఆర్జీవీకి సూచించారు మంత్రి పేర్నినాని.. మీడియా ప్రశ్నలకు సమాధానంగానో.. మరో కారణంగానో రకరకాల కామెంట్లు వస్తాయని.. దాన్ని ప్రభుత్వ నిర్ణయంగా చూడకూడదన్న స్పష్టం చేశారు.. ఇక, ఇద్దరి మధ్య జరిగిన పలు ఆసక్తికర అంశాలకు సంబంధిచిన వివరాల కోసం కింది వీడియోను క్లిక్ చేయండి..