కర్నాటకలోని తుంగభద్ర జలాశయం నిండుతోంది. ఎగువున కురుస్తున్న వర్షాలతో తుంగభద్ర జలాశయానికి ఇన్ ఫ్లో పెరిగిందని అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఇన్ ఫ్లో 9,342 క్యూసెక్కులుగా వుంది. తుంగభద్ర జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 1633 అడుగులు కాగా, ప్రస్తుత నీటిమట్టం 1593 అడుగులుగా వుంది. పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 100. 855 టీఎంసీలు. ప్రస్తుత నీటి నిల్వ సామర్థ్యం 12.54 టీఎంసీలుగా వుంది.
ఇన్ ఫ్లో ఇలాగే కొనసాగితే గతేడాది కంటే ముందుగానే డ్యామ్ నిండే అవకాశం వుందని ఇరిగేషన్ అధికారులు తెలిపారు. సాధారణంగా వర్షాలు బాగా పడినప్పుడు మాత్రమే వరద ప్రవాహం పెరుగుతుంది. ఏటా జూన్, జూలై మాసాల్లో రుతుపవనాల వల్ల వర్షాలు బాగా పడతాయి. అప్పుడు ప్రాజెక్టుకి వచ్చే ఇన్ ఫ్లో పెరుగుతూ వుంటుంది. అయితే, ఈసారి చాలాముందుగానే ప్రాజెక్టుకి వరద ప్రవాహం రావడం పట్ల రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అందులోనూ రుతుపవనాల రాక కూడా ప్రారంభం కావడంతో గత ఏడాది కంటే ఈసారి ఇన్ ఫ్లో మరింతగా పెరుగుతుందని అంటున్నారు.
మరో వైపు ప్రాజెక్టుల విషయంలో కర్నాటక వైఖరిపై తెలంగాణ అభ్యంతరం తెలిపింది. సాగు నీటి ప్రాజెక్టుల నిర్మాణం విషయంలో కర్ణాటకపై కేంద్ర జల సంఘం (CWC) కి తెలంగాణ ప్రభుత్వం ఇటీవల ఫిర్యాదు చేసింది. తెలంగాణ ఇంజినీర్ ఇన్ ఛీఫ్ కేంద్ర జల సంఘానికి గతవారంలో ఓ లేఖ రాశారు. తుంగభద్రపై కర్ణాటక ప్రభుత్వం నిర్మిస్తున్న అప్పర్ తుంగ, అప్పర్ భద్ర ప్రాజెక్టులను వెంటనే నిలిపివేయాలంటూ ఆ లేఖలో తెలంగాణ కోరింది. కృష్ణా నది నుంచి తుంగభద్రకు వరద నీరు తగ్గుతుంది. కర్నాటక ప్రాజెక్టుల కారణంగా దిగువ ప్రాంతమైన తెలంగాణకు అన్యాయం జరుగుతోందని వాదిస్తోంది.