ఏపీలోని పరిస్థితులపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నెల్లూరులో మీడియాతో మాట్లాడుతూ.. వైసీపీకి 22 మంది ఎంపీలు ఉన్నా ఎందుకు నోరు మెదపడం లేదన్నారు. ఏపీ దివాళా తీసింది. లక్షలాది కోట్ల రూపాయలు అప్పులు చేస్తున్నా అభివృద్ధి లేదు. ఏ రంగంలో అభివృద్ధి చెందిందో చెప్పమంటే ఒక్క మంత్రీ సమాధానం చెప్పడం లేదు. అప్పులిస్తే తప్పించి జీతాలు, పింఛన్లు ఇచ్చే పరిస్థితి లేదు. మంత్రులందరూ డమ్మీలు. సీఎంకి సజ్జల వాయిస్. అన్ని శాఖలకి సంబంధించి సజ్జలే మాట్లాడుతారు. రెండున్నరేళ్లలో ఏ పార్టీ వారూ సీఎంని కలవలేకపోయారు. ఏపీలో వన్ మ్యాన్ షో కొనసాగుతుంది. ముఠా పాలన సాగుతుంది. ఏపీలో లా అండ్ ఆర్డర్ ఘోరంగా విఫలమైంది. దళితులపైనా అట్రాసిటీ కేసులు పెట్టే పరిస్థితికి దిగజారారని ఆయన అన్నారు.
అంతేకాకుండా పట్టాభిని అరెస్ట్ చేశారు. మరి ఆయన ఇంటిపైనా, టీడీపీ కార్యాలయంపైన దాడి చేసిన వారిని అరెస్ట్ చేయరా..? అని ప్రశ్నించారు. ప్రజలు పోరాటానికి సమాయత్తమవుతున్నారు. సీపీఐ పోరాటానికి సిద్దమైంది. చంద్రబాబు కోరినట్టు రాష్ట్రపతిపాలన పెడితే, జగన్ నెత్తిన పాలుపోసినట్టే. జగన్ స్థానికంగానే పోరాటం చేయాలి. టీడీపీ గతంలో రాష్ట్రపతి పాలనని వ్యతిరేకించి పోరాటం చేసిందని గుర్తు చేశారు.
రైతుల్లోనూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. రైతులు చనిపోతే కనీసం పీఎం సంతాపం తెలపలేదు. సీఎం జగన్ కేంద్రానికి వ్యతిరేకంగా మాట్లాడలేడు. పీఎంకి కనీసం వినతిపత్రం కూడా ఇవ్వలేకున్నారు. ఎంపీలు చేతకాని దద్దమ్మలు. అప్పులు తెచ్చి అకౌంట్లలో వేయడానికి సీఎం ఎందుకు..? బ్యాంక్ ఆఫీసర్ చాలు అంటూ ధ్వజమెత్తారు.