మంచు మోహన్‌బాబు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన ఇటీవల కాలంలో రాజకీయాల్లో వైసీపీకి మద్దతిస్తున్నారు. 2019 ఎన్నికల్లో కూడా మోహన్‌బాబు వైసీపీకి మద్దతిచ్చారు. పలు మార్లు సీఎం జగన్‌ను కూడా కలిశారు. అయితే తాజాగా మోహన్‌బాబు చేసిన వ్యాఖ్యలు చర్చకు దారి తీశాయి. ఓ కేసు సందర్భంగా తిరుపతికి వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడారు. తాను బీజేపీ మనిషిని అంటూ ప్రకటించారు. కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉండాలని కోరుకునే వ్యక్తుల్లో తాను కూడా ఒకడిని అంటూ వ్యాఖ్యానించారు. తాను రియల్ హీరోను అని.. విద్యార్థుల కోసం పోరాడితే అక్రమంగా కేసులు పెట్టారని ఆరోపించారు.
2019లో విద్యార్థులతో కలిసి ఫీజు రీయింబర్స్‌మెంట్ కోసం మోహన్‌బాబు ధర్నా చేశారు. టీడీపీ ప్రభుత్వం హయాంలో విద్యార్థులకు ఫీజు రీయింబర్స్ మెంట్ చెల్లించలేదని 2019 మార్చి 22న తిరుపతి – మదనపల్లె జాతీయ రహదారిపై బైఠాయించి విద్యార్థులతో కలిసి మంచు కుటుంబం ధర్నా చేసింది. ఆ సమయంలో ఎన్నికల కోడ్ అమలులో ఉండటంతో అధికారులు కేసు నమోదు చేశారు. రోడ్డుపైకి వచ్చి వాహనదారులకు ఇబ్బంది కలిగించారని, ఎన్నికల కోడ్ ఉల్లంఘించారని ఆరోపించారు. ధర్నాకు ముందస్తు పోలీస్ అనుమతి లేదని, 341, 171(ఎఫ్), పోలీస్ యాక్ట్ 290 కింద మోహన్ బాబు, ఆయన కుమారులు మంచు విష్ణు, మనోజ్, శ్రీవిద్యానికేతన్ విద్యాసంస్థల ఏవో తులసినాయుడు, పీఆర్వో సతీష్‌పై చంద్రగిరి పోలీసులు కేసు నమోదు చేశారు.
ఈ కేసుకు సంబంధించి సినీ నటుడు, శ్రీవిద్యానికేతన్ విద్యాసంస్థల అధినేత మోహన్‌బాబు, ఆయన కుమారుడు మంచు విష్ణు, మంచు మనోజ్ ఈరోజు తిరుపతి కోర్టుకు హాజరయ్యారు. ఈ సందర్భంగా మోహన్‌బాబు పాదయాత్ర ద్వారా తిరుపతి కోర్టుకు చేరుకున్నారు. ఎన్టీఆర్ సర్కిల్ నుంచి కోర్టు ప్రాంగణం వరకు మోహన్ బాబు, విష్ణు, మనోజ్ పాదయాత్రగా అభిమానులతో కోర్టుకు హాజరయ్యారు. దీంతో కోర్టు ప్రాంగణం విద్యార్థులతో కిక్కిరిసింది.మోహన్ బాబుకు సంఘీభావంగా బీజేపీ నేత కోలా ఆనంద్, వైసీపీ నేతలు అన్నా రామచంద్ర, ఎంవీఎస్ మణి కోర్టు వద్దకు వచ్చారు.