Gorantla Madhav: హిందూపురం వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ మరో వివాదంలో చిక్కుకున్నారు. అనంతపురంలో గోరంట్ల మాధవ్ నివసిస్తున్న ఇంటి అద్దె, కరెంట్ బిల్లు బకాయిలు చెల్లించట్లేదని యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అనంతపురం రాంనగర్‌లోని తన ఇంట్లో ఎంపీ గోరంట్ల మాధవ్ అద్దెకు ఉంటున్నారని.. ఇప్పటివరకు రూ.2 లక్షలకు పైగా అద్దె, కరెంట్ బకాయిలు ఉన్నట్లు తెలిపాడు. అవి చెల్లించకపోగా, ఇల్లు ఖాళీ చేయనని ఎంపీ తన అనుచరులతో బెదిరిస్తున్నారని చెప్పాడు. దీనిపై అనంతపురం ఫోర్త్ టౌన్ పోలీసులు మధ్యవర్తులుగా వ్యవహరిస్తూ సమస్యను పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం అందుతోంది.
Read Also: Moinabad Episode: ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో కొత్త ట్విస్ట్.. మరో కేసు నమోదు
కాగా ఇప్పటివరకు తనకు రావలసిన అద్దె ఇప్పించి ఇంటిని ఖాళీ చేయాలని ఇంటి యజమాని మల్లికార్జునరెడ్డి డిమాండ్ చేస్తున్నాడు. అద్దె అడిగితే టిప్పర్లతో తొక్కించి చంపుతామంటూ గోరంట్ల మాధవ్ అనుచరులు బెదిరిస్తున్నారని మల్లికార్జున రెడ్డి ఆవేదన వ్యక్తం చేశాడు. దీంతో ఇంటి యజమాని తన మనుషులతో కలిసి ఎంపీ గోరంట్ల మాధవ్ ఉంటున్న ఇంటి ఎదుట ధర్నా చేయాలని భావించాడు. ఈ వ్యవహారం పోలీసుల వరకు చేరడంతో వాళ్లు వచ్చి మల్లికార్జునరెడ్డితో చర్చలు జరిపారు. సీఐ జాకీర్ హుస్సేన్ పెద్దమనుషుల సమక్షంలో ఇంటి యజమాని, ఎంపీ మాధవ్‌తో ఓ గదిలో చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. కాగా ఇటీవల ఓ వీడియో విషయంలో ఎంపీ గోరంట్ల మాధవ్ ఆరోపణలు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే.